జియో రంగ ప్రవేశంతో టెలికం రంగంపై ముకేశ్ అంబానీ విసిరిన పంచ్ ప్రభావం ఇంకా అలాగే కొనసాగుతోంది. వచ్చే ఎనిమిది నెలల్లో జియో సబ్ స్క్రైబర్ల సంఖ్య ఐదు కోట్లకు చేరుతుందని బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది.
న్యూఢిల్లీ: టెలికం రంగంలో రిలయన్స్ జియో ఒక సంచలనం. ఉచిత వాయిస్ కాల్స్, డేటా ఆఫర్లతో కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకుంది. జియోఫోన్ కోసం గంటల తరబడి క్యూలైన్లో నిలబడిన వారినీ చూశాం. టెలికాం ఇండస్ట్రీలో ఉన్న తీవ్ర పోటీని తట్టుకుని జియో ఫోన్ వచ్చే డిసెంబర్ నెలాఖరు నాటికి మరో 5 కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకుంటుందని తాజా నివేదిక ఒకటి పేర్కొంది.
దేశ వ్యాప్తంగా 45-50 కోట్ల మంది ఫీచర్ ఫోన్ వినియోగదారులు ఉండగా, ఈ ఏడాది చివరి నాటికి జియోకు 50మిలియన్ల (5కోట్ల మంది) సబ్‌స్క్రైబర్లు ఉంటారని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది. అంటే మొత్తం ఫీచర్‌ఫోన్ వినియోగదారుల్లో ఇది 10శాతం. అయితే, ఫీచర్ ఫోన్ సబ్‌స్క్రైబర్ల వృద్ధిలో జియోతో సహా అన్ని టెలికం సంస్థలకు ఏఆర్‌పీయూ(యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) కీలకం కానుంది.
undefined
జియో దీనిపైనే ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. దీనికి తోడు ప్రతి నెలా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు సైతం పెరుగుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫీచర్‌ఫోన్ వినియోగదారులను ఆకట్టుకోవాలంటే ఏఆర్‌పీయూను కూడా దృష్టిలో పెట్టుకోవాలని నివేదిక తెలిపింది. జనవరి-మార్చి మధ్య రిలయన్స్ గతేడాది రూ.131.7కోట్ల ఆదాయం ఆర్జించగా, ఈ ఏడాది అది రూ.126.2కోట్లకు పడిపోయింది.
‘ఫిబ్రవరి 2019లో యాక్టివ్ సబ్‌స్క్రైబర్స్ 1,023 మిలియన్ల మంది ఉన్నారు. రిలయన్స్ జియోకు 9.3మిలియన్లు ఉండగా, భారతీ ఎయిర్‌టెల్ 3.2మిలియన్లు, వొడాఫోన్/ ఐడియాలు 7.2మిలియన్ల యాక్టివ్ యూజర్లను కోల్పోయాయి’ అని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా తమ వినియోగదారులకు మినిమం రీఛార్జ్ ప్లాన్‌ను అమలు చేయడం కూడా ఇందుకు కారణమని పేర్కొంది.
తాజా పరిణామాలు టెలికం రంగంలో ‘సర్వీస్ ప్రొవైడర్ల’ మధ్య మరింత పోటీ పెంచే విధంగా ఉన్నాయి. రిలయన్స్ జియో కూడా ఇక ముందు ఫీచర్ ఫోన్ సబ్ స్క్రైబర్ల మనస్సు చూరగొనడంపైనే ప్రధానంగా కేంద్రీకరించనున్నది. స్మార్ట్ ఫోన్ సబ్ స్క్రైబర్లు తగ్గినట్లు కనిపించినా వచ్చే రెండు, మూడు త్రైమాసికాల్లో వొడాఫోన్ ఐడియా తన నెట్ వర్క్‌ను స్థిరీకరించుకుంటుందని అంచనా వేస్తున్నారు. టెలికం రంగంలో అధిక వ్రుద్ధి రేటు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఫిబ్రవరి నెలాఖరు నాటికి టెలికం రంగంలో 102.3 కోట్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. కానీ జియోకు 93 లక్షల మంది యూజర్లు జత కలిస్తే, భారతీ ఎయిర్ టెల్/ఐడియా వొడాఫోన్ 3.2/ 7.2 మిలియన్ల మంది వినియోగదారులను కోల్పోయాయి. జియో ఫోన్ వల్ల రిలయన్స్ ఎక్కువ లాభాలు పొందగలిగింది. మొబైల్ బ్రాడ్ బాండ్ సర్వీసులో రిలయన్స్ జియోదే 78 శాతం వాటా. భారతీ ఎయిర్ టెల్ 18 శాతం, వొడాఫోన్ ఐడియా నాలుగు శాతం లబ్ధి పొందాయి.