దటీజ్ బెంజ్ స్పెషల్: నవరాత్రి ఉత్సవాల్లో దసరా రోజే 200 కార్లు సేల్

By Nagaraju penumalaFirst Published Oct 10, 2019, 4:02 PM IST
Highlights

ఆర్థిక మాంద్యంతో ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలు దిగాలు పడుతున్నా జర్మనీ ఆటో మేజర్ మెర్సిడెస్ బెంజ్ మాత్రం పండుగ చేసుకుంది. నవరాత్రి, దసరా సంబురాల సందర్భంగా ఒక్కరోజే 200కి పైగా కార్లు అమ్ముడు పోవడం ఆసక్తికర పరిణామం.

న్యూఢిల్లీ: దసరా, నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం కార్ల విక్రయాల్లో జర్మనీ ఆటో దిగ్గజం మెర్సిడెస్​ బెంజ్​ సంస్థ దూసుకు వెళ్లింది. ముంబై సిటీ, గుజరాత్​ వంటి రాష్ట్రాల్లో ఒక్కరోజే అత్యధికంగా 200కి పైగా కార్ల విక్రయాలు జరిగినట్లు ప్రకటించింది. ఈ సంఖ్య గతేడాదితో పోల్చితే అధికంగా ఉన్నట్లు తెలిపింది.

జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్​ బెంజ్​ భారత విపణిలో దసరా రోజున అమ్మకాల జోరు కనబరిచింది. ఒక్క రోజులోనే ముంబై సిటీ, గుజరాత్​ రాష్ట్రాల్లో 200లకు పైగా కార్లు​ విక్రయించింది. ముంబైలో దసరా రోజు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 125 కార్ల విక్రయాలు జరిగినట్లు తెలిపింది సంస్థ. ఆ తర్వాతి స్థానంలో 74 కార్ల అమ్మకాలతో గుజరాత్​ నిలిచింది.

దీనిపై మెర్సిడెస్​ బెంజ్​ ఇండియా ఎండీ​, సీఈఓ మార్టిన్​ ష్వెంక్​ స్పందిస్తూ ‘ఈ దసరా పండుగ రోజున వినియోగదారులను నుంచి అత్యధికంగా స్పందన రావటంతో ముంబైతోపాటు గుజరాత్ రాష్ట్రంలోని వివిధ నగరాల్లో 200లకుపైగా కార్ల విక్రయాలు జరిగాయి. కస్టమర్ల నుంచి ఇంత స్థాయిలో ఉత్సాహం, ఆసక్తి ఉందని నవరాత్రి సూచిస్తుంది. అది 2018లోనే మేము చూశాం. ఇది మాకు సానుకూల అంశం’ అని చెప్పారు.

అత్యధికంగా అమ్ముడైన కార్లు..మెర్సిడెస్​ బెంజ్​లోని వివిధ మోడళ్లలో అత్యధికంగా అమ్ముడైన వాటిలో సెడాన్​ సీ, ఈ మోడల్ కార్లతోపాటు జీఎల్​సీ, జీఎల్​ఈ వంటి స్పోర్ట్​ యుటిలిటీ వాహనాలు ఉన్నాయి.

click me!