బహిరంగ విపణిలోకి టాటా టిగోర్‌ ఈవీ: జస్ట్ రూ.9.44 లక్షలే

By Nagaraju penumalaFirst Published Oct 10, 2019, 12:36 PM IST
Highlights

టాటా మోటార్స్ తన టిగోర్ ఎలక్ట్రిక్ వెహికల్‌ను బహిరంగ విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.9.44 లక్షలుగా నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్రభుత్వ సంస్థలకు, క్యాబ్ సర్వీసులకు మాత్రమే విక్రయించే టాటా మోటార్స్ తన వ్యూహాన్ని మార్చుకున్నది. బహిరంగ మార్కెట్లోకి తేవాలని నిర్ణయించుకున్నది.

న్యూఢిల్లీ: దేశీయ విపణిలోకి టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వర్షన్ సరికొత్త టిగోర్‌ కారును విడుదల చేసింది. వ్యక్తిగత, ఫ్లీట్‌ కస్టమర్ల అవసరాలకు తగినట్లు ఈ కారును తీర్చిదిదినట్లు టాటా మోటార్స్‌ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్‌ టిగోర్‌ ధర రూ.9.44 లక్షలుగా నిర్ణయించింది.

మూడు వేరియంట్లతో దేశవ్యాప్తంగా 30కి పైగా నగరాల్లో ఎలక్ట్రిక్ టిగోర్‌ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. వాణిజ్య అవసరాల కోసం ఫేమ్‌-2 పథకం కింద అన్ని రకాల ప్రోత్సాహకాలకు ఈ కారు ఎంపిక చేయబడిందని టాటా తెలిపింది.

గతంలో తీసుకువచ్చిన టిగోర్‌ ఈవీ వెర్షన్‌ ఒకసారి చార్జింగ్‌తో 142 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుండగా తాజాగా తీసుకువచ్చిన వెర్షన్‌ 213 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని వెల్లడించింది. ఈ కారులో 21.5 కిలోవాట్‌ బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 213 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇది గతంలో కంటే 71 కిలోమీటర్లు అదనం.

ఎలక్ట్రిక్ టాటా టిగోర్ మోడల్ కారులో రెండు చార్జింగ్‌ పోర్టులు ఉన్నాయి. ఫాస్ట్‌ చార్జింగ్‌ కోసం ఒకటి, స్లో చార్జింగ్‌ కోసం మరొకటని కంపెనీ తెలిపింది. టాటా టిగోర్‌ ఎలక్ట్రిక్ వర్షన్ కారును ఇప్పటికే పలు ప్రభుత్వ శాఖలు, ఫ్లీట్‌ యజమానులు ఉపయోగిసున్నట్లు టాటా మోటార్స్‌ తెలిపింది.

అదనంగా ఎక్స్‌ఈ వేరియంట్‌లో రెండు ఎయిర్‌బ్యాగులు ఉన్నాయి. మూడు వేరియంట్లలో యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టంతో పాటు ఇతర సేఫ్టీ ఫీచర్లు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. వీటితో సిగేచర్‌ ఈవీ డెకల్స్‌, ప్రీమియం ఫ్రంట్‌ గ్రిల్‌, స్టైలిష్‌ అలారు వీల్స్‌, హైట్‌ అడ్జబుల్‌ సీట్‌, అర్మాన్‌ సౌండ్‌ సిస్టం వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇప్పటి వరకు టాటా మోటార్స్‌ ఈ ఎలక్ట్రిక్‌ వాహనాలను కేవలం ప్రభుత్వ రంగ సంస్థలకు, క్యాబ్‌ నిర్వాహకులకు మాత్రమే విక్రయించేది. ఇక నుంచి వ్యక్తిగత వినియోగదారులు కూడా ఈ వాహనాలను కొనుగోలు చేయవచ్చునని కంపెనీ తెలిపింది.

click me!