నైపుణ్యం ఉంటే రెడ్ కార్పెట్.. ఐటీలో కొలువుల తీరు

By narsimha lode  |  First Published Sep 13, 2019, 10:45 AM IST

ఐటీ రంగం డిమాండ్ కు తగ్గట్టుగా  నిపుణులు కావాలని ఆ రంగం భావిస్తోంది. ఈ మేరకు నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది.


న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి గల డిమాండ్‌కు తగినట్లు నిపుణులు లేరని ఇన్ఫోసిస్ నాలెడ్జ్ ఇనిస్టిట్యూట్ నిర్ధారించింది. అనలటిక్స్, యూజర్ ఎక్స్‌పీరియన్స్, ఆటోమేషన్, ఐటీ ఆర్కిటెక్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలకు అత్యధిక డిమాండ్ ఉన్నదని ఇన్ఫోసిస్ నాలెడ్జ్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన సర్వే పేర్కొంది. 

బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం కల కంపెనీల్లోని దాదాపు 1000 సీఎక్స్‌వోలు, ఇతర సీనియర్ సిబ్బందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఇన్ఫోసిస్ నాలెడ్జ్ ఇనిస్టిట్యూట్ ఈ అధ్యయనం నిర్వహించింది. 

Latest Videos

undefined

డిమాండ్‌కు తగిన నిపుణులు అందుబాటులో లేకపోవడానికి బడ్జెట్ కొరత కూడా ఒక ప్రధాన కారణమని ఇన్ఫోసిస్ నాలెడ్జ్ ఇనిస్టిట్యూట్ తెలిపింది. అనంతరం సంస్థాగతమైన సమస్యలు, మేనేజ్మెంట్‌పై అవగాహన లేమి, నైపుణ్యాలకు ప్రోత్సాహ లేమి వంటి అంశాలు కారణమని సర్వే నివేదిక వెల్లడించింది. 

మరో రకంగా చూస్తే పరిశోధన కొరవడటంతోపాటు సరిగ్గా నేర్చుకోక పోవడం వంటి అంశాలు నైపుణ్యాలకు సానబెట్టకుండా అడ్డుకుంటాయని ఇన్ఫోసిస్ నాలెడ్జ్ ఇనిస్టిట్యూట్ అధ్యయన నివేదిక వెల్లడించింది.

ఈ నేపథ్యంలో ఐటీ రంగంలో కొలువుల తీరే మారిపోతోంది. గతంలో మాదిరిగా మంచి మార్కులతో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉంటే చాలడం లేదు. సరికొత్త డిజిటల్‌ టెక్నాలజీ రంగాల్లో నైపుణ్యాలు ఉన్న అభ్యర్థుల కోసం ఐటీ కంపెనీలు ఎదురు చూస్తున్నాయి. ఐటీ ఉద్యోగాల తీరుతెన్నులపై తాజాగా వెలువడిన ‘ఇన్ఫోసిస్‌ టాలెంట్‌ రాడార్‌, 2019’ నివేదిక ఈ విషయం పేర్కొంది. 

డిజిటల్‌ టెక్నాలజీల్లో అనలటిక్స్‌, కృత్రిమ మేధ (ఏఐ), ఆటోమేషన్‌ వంటి టెక్నాలజీ రంగాల్లో నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులకు కంపెనీలు రెడ్‌ కార్పెట్‌ పరుస్తున్నాయి. ఈ టెక్నాలజీల్లో నైపుణ్యాలు ఉన్న అభ్యర్ధులకు ఐటీ జాబ్స్‌ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉందని నివేదిక పేర్కొంది.

డిజిటల్‌ టెక్నాలజీల్లో అనలిటిక్స్‌, యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌లకు అత్యంత (67 శాతం) డిమాండ్‌ ఉంది. ఆటోమేషన్‌ (61 శాతం), ఐటీ ఆర్కిటెక్చర్‌ (59 శాతం), కృత్రిమ మేధ (58 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 

ఉద్యోగాలు పొందడంలో సరికొత్త టెక్నాలజీల్లో నైపుణ్యాలతోపాటు అభ్యర్థులకు టీమ్‌వర్క్‌, నాయకత్వ లక్షణాలు, సంభాషణా నైపుణ్యాల వంటి సాఫ్ట్‌ స్కిల్స్‌ కూడా అత్యంత కీలకమని ‘ఇన్ఫోసిస్‌ టాలెంట్‌ రాడార్‌, 2019’ పేర్కొంది.

ఇన్ఫోసిస్ సీఓఓ ప్రవీణ్ రావు మాట్లాడుతూ ‘ఐటీ రంగంలో ప్రస్తుతం టాలెంట్‌ వార్‌ నడుస్తోంది. స్పష్టంగా చెప్పాలంటే నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులకు తీవ్ర కొరత ఉంది. వ్యాపారంలో నెట్టుకు రావాలంటే సరైన అభ్యర్ధులను నియమించుకుని వారి నైపుణ్యాలు అభివృద్ధి చేసి, ప్రత్యర్థి కంపెనీలు వారిని తన్నుకుపోకుండా కాపాడుకోవాలి’ అని చెప్పారు. 

ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ సీవోవో ప్రవీణ్ రావు మాట్లాడుతూ ‘డిజిటల్ ప్రయాణంలో ఒక కంపెనీ విజయం సాధించాలంటే వివిధ రకాల నైపుణ్యం ఉన్నవారిని నియమించుకోవాలి. ఇప్పటికే ఉన్నవారి నైపుణ్యాలకు సాన బట్టాలి. శిక్షణపై పెట్టుబడి పెట్టాలి. అప్పుడు వారు కాలానికి తగినట్లు కంపెనీని ముందుకు తీసుకెళతారు’ అని చెప్పారు. 

click me!