
న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కాంగ్రెసు ప్రభుత్వ పతనం వెనక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హస్తం ఉందనే వార్తాకథనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. పుదుచ్చేరీలో నారాయణ స్వామి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బిజెపికి వైఎస్ జగన్ సహకరించారని వార్తాకథనాలు ప్రచురితమయ్యాయి.
మల్లాడి కృష్ణారావుతో వైఎస్ జగన్ రాజీనామా చేయించడమే కాకుండా కొన్ని వ్యూహాత్మక అస్త్రాలను కూడా జగన్ సమకూర్చినట్లు చెబుతున్నారు. మల్లాడి కృష్ణారావు ద్వారా ప్రభుత్వాన్ని కూల్చడంలో జగన్ కీలక పాత్ర పోషించారని అంటున్నారు. వాస్తవానికి కాంగ్రెసు శాసనసభ్యుడు మల్లాడి కృష్ణారావు జనవరి 13వ తేదీన రాజీనామా చేశారు. అయితే సాంకేతిక కారణాలతో ఆ రాజీనామా ఆమోదం పొందలేదు.
ఫిబ్రవరి 15వ తేదీన యానాం ఎమ్మెల్యే అయిన మల్లాడి కృష్ణారావు వైఎస్ జగన్ తో సమావేశమయ్యారు. ఆ భేటీ ముగిసిన 15 నిమిషాలలోపే తాను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మల్లాడి ప్రకటించారు. దాంతో పుదుచ్చేరిలో నారాయణస్వామి ప్రభుత్వ పతనానికి నాంది పడింది. ఆ తర్వాత మరికొందరు ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరు రాజీనామా చేశారు.
30 మంది ఎమ్మెల్యేలు ఉన్న పుదుచ్చేరిలో నెల రోజుల్లోనే 9 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు వారిలో ఓ డిఎంకె సభ్యుడు కూడా ఉన్నారు. మిగతావారంతా కాంగ్రెసు సభ్యులు. దాంతో నారాయణస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడింది. బలనిరూపణ చేసుకోలేని స్థితిలో గత 22వ తేదీన ప్రభుత్వం కూలింది. దాంతో పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించారు. ఆ తర్వాత నాలుగు రోజులకే అక్కడ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.
యానాం పుదుచ్చేరిలో భాగం. అయితే, తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు సమీపంలో ఉంటుంది. యానాం నుంచి మల్లాడి కృష్ణారావు పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నకయ్యారు. అయితే, మల్లాడి కృష్ణారావు జగన్ కు సన్నిహితంగా ఉంటారు. జగన్ ను ఆయన చాలాసార్లు కలుసుకున్నారు.
జగన్ ను మల్లాడి కృష్ణారావు ప్రశంసిస్తుంటారు కూడా. జగన్ తమిళనాడులో పార్టీ పెడితే తాను కాంగ్రెసుకు రాజీనామా చేసి, జగన్ పార్టీలో చేరుతానని గతంల ఆయన ప్రకటించారు జగన్ తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. అందుకే పుదుచ్చేరిలో ప్రభుత్వ పతనానికి బిజెపి జగన్ సహకారం తీసుకున్నట్లు వార్తాకథనాల సారాంశం