‘ఇద్దరిని కాదు 20 మందిని కనాల్సింది..’ మరో వివాదంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి

By AN TeluguFirst Published Mar 22, 2021, 9:54 AM IST
Highlights

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పేద కుటుంబాలు 20 మంది పిల్లల్ని కనాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోవిద్ మహమ్మారి నేపథ్యంలో పేద కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ పథకం కింద ఎక్కువ రేషన్ అందాలంటే వారికి ఇద్దరు పిల్లలు కాదు 20 మంది ఉండాలని ఆదివారం ఓ సభలో అన్నారు. 

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పేద కుటుంబాలు 20 మంది పిల్లల్ని కనాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోవిద్ మహమ్మారి నేపథ్యంలో పేద కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ పథకం కింద ఎక్కువ రేషన్ అందాలంటే వారికి ఇద్దరు పిల్లలు కాదు 20 మంది ఉండాలని ఆదివారం ఓ సభలో అన్నారు. 

ఈ పథకం కింద ప్రతీ ఇంటికి ఐదు కిలోల రేషన్ ఇచ్చాం. ఒకింట్లో పది మంది ఉంటే వారికి 50 కిలోలు, 20 మంది ఉంటే క్వింటాల్ రేషన్ పంపిణీ అయ్యింది. అయితే కొంతమంది క్వింటాల్ రేషన్ తీసుకున్న వారిని చూసి అసూయ పడుతున్నారు. అలాంటి వారు ఇద్దరిని కాకుండా 20 మందిని కనాల్సింది అంటూ వ్యాఖ్యానించారు. 

గతేడాది కాలంగా కరోనాతో కోట్లాది మంది పేదలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద నిరుపేదలకు ఒక్కొక్కరికి ఐదు కేజీల బియ్యం, ఒక కిలో పప్పు పంపిణీ చేసింది. 

ఈ మార్చి 10వ తేదీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రావత్, తక్కువ మంది పిల్లలున్న కుటుంబాలు తక్కువ రేషన్ పొందుతున్నాయనే చర్చను తోసిపుచ్చారు. కోవిడ్ కంటే ముందునుండి కూడా అలాంటి కుటుంబాలు పిల్లలకు సరైన ఆహారాన్ని అందించలేకపోయాయని, అప్పుడు ఎక్కువమంది పిల్లలుంటే ఇప్పటి సమయంలో ఎక్కువ రేషన్ పొందేవారని అన్నారు. 

అయితే దీనివల్ల జనాభా పెరుగుదల, పర్యావరణంపై ప్రభావం, మౌలిక సదుపాయాలపై ఒత్తిడి గురించి ముఖ్యమంత్రి ప్రస్తావించలేదు. రామ్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ భారతదేశంలో 200 సంవత్సరాల పాలన మీద అమెరికాను కూడా నిందించారు.  అంతేకాదు డెహ్రాడూన్ లో మహిళలు రిపిడ్ జీన్స్ వేసుకోవడం మీద కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. 

200 సంవత్సరాలు మనల్ని బానిసలుగా చేసి, ప్రపంచమంతా గుత్తాధిపత్యం సాగించిన అమెరికా కూడా కరోనా మహమ్మారి నేపథ్యంలో కష్టపడుతోంది అంటూ ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించడం కొసమెరుపు. 

గతవారం చిరిగిన జీన్స్ వేసుకునే మహిళలు తమ పిల్లలను సరిగా పెంచలేరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలను ఎదుర్కున్నారు. ఎన్జీఓ నడిపే ఓ మహిళ 'రిప్డ్ జీన్స్' వేసుకోవడం చూసి తాను షాక్ అయ్యానని అన్నారు.

ఇలాంటి దుస్తులు వేసుకున్న మహిళలు సమాజంలో ప్రజల సమస్యల మీద పనిచేస్తున్నామంటూ తిరుగుతుంటే మన పిల్లలకు మనం ఎలాంటి సందేశం ఇస్తున్నాం? అని ప్రశ్నించారు. ఇవన్నీ ఇంట్లో నుండే మొదలు కావాలి. మనం ఏది చేస్తే మన పిల్లలు అదే ఫాలో అవుతారు. వారికి సరైన సంప్రదాయం ఇంట్లోనే నేర్పించాలి అన్నారు. అయితే తన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఆ తరువాత క్షమాపణలు తెలిపారు. 

click me!