ఇకపై యూపీ రోడ్లు అద్దంలా మెరిసిపోనున్నాయా? : యోాగి సర్కార్ యాక్షన్ ప్లాన్

By Arun Kumar PFirst Published Oct 3, 2024, 1:47 PM IST
Highlights

ఉత్తర ప్రదేశ్‌లో రోడ్ల అభివృద్ధిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టి సారించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణం, నగరానికి అత్యుత్తమ రోడ్డు కనెక్టివిటీ కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఈ మేరకు కీలక చర్యలు చేపట్టారు. 

లక్నో : ఏ ప్రాంత అభివృద్దిలో అయినా అక్కడి రోడ్లు కీలక పాత్ర పోషిస్తాయి. రోడ్లు బాగున్నాయంటే అక్కడ అభివృద్ది కూడా బాగున్నట్లే. ప్రజల రవాణాకే కాదు సరుకు రవాణాకు కూడా మంచి రోడ్లు చాలా కీలకం. ఇది గుర్తించిన ఉత్తర ప్రదేశ్ సర్కార్ రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీ, పట్టణం, నగరం, మహానగరానికి అత్యుత్తమ రోడ్డు కనెక్టివిటీ కల్పించేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయత్నిస్తున్నారు. ఇంందులొ భాగంగానే తమ ప్రాంతాల్లో కొత్త రోడ్లు, బైపాస్‌లు, వంతెనల నిర్మాణం, పాత రోడ్ల మరమ్మతుల కోసం తదుపరి 15 రోజుల్లో ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సీఎం యోగి అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలకు సూచించారు.

ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడిన సీఎం యోగి... మారుమూల గ్రామం నుండి మహానగరం వరకు రాష్ట్రంలోని ప్రతి రోడ్డు మెరుగ్గా ఉండాలని సూచించారు. ఇందుకోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు సహకారం చాలా అవసరం అన్నారు. వారిివారి నియోజకవర్గాల పరిధిలో మంచి రోడ్డు సదుపాయం కల్పించేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్నారు.

Latest Videos

రోడ్ల కోసం నిధుల కొరత లేదని సీఎం యోగి అన్నారు. కాబట్టి అందరు ప్రజాప్రతినిధులు తమ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సమక్షంలో కోర్ కమిటీతో చర్చించి, జిల్లా యంత్రాంగంతో కలిసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. కొత్త రోడ్లు, పాత రోడ్ల మరమ్మతులు, వంతెన నిర్మాణం, రింగ్ రోడ్డు లేదా బైపాస్, ప్రధాన లేదా జిల్లా రోడ్డు, సర్వీస్ లేన్ ... ఇలా ఎక్కడ ఏది అవసరముంటే అలా చేయాలన్నారు. ఇందుకోసం ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు పంపాలని... ప్రభుత్వ స్థాయిలో తక్షణమే నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు.

ఏదైనా మారుమూల ప్రాంతంలో కేవలం 250 మంది జనాభా ఉన్నా అక్కడ పక్కా రోడ్డు సౌకర్యం కల్పించాలని సీఎం యోగి సూచించారు. మొత్తంగా రాష్ట్రంలో రోడ్లన్ని మెరుగ్గా మారిపోవాలని ... ఏ ఒక్కరి నుండి తమ ప్రాంతాన్ని రోడ్డు సౌకర్యం బాగాలేదనే మాట వినిపించకూడదని సీఎం సూచించారు. 

ఏ జిల్లాల్లో బైపాస్ రోడ్లు లేవో అక్కడ ప్రజాప్రతినిధులు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మతపరమైన, ఆధ్యాత్మిక, చారిత్రక లేదా పురాణ ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాల మెరుగైన కనెక్టివిటీ కోసం కూడా తగిన నిధులు కేటాయించామని యోగి తెలిపారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి అటువంటి ప్రాంతాల్లోని రోడ్లను విస్తరించడం, బలోపేతం చేయడం అవసరమని అన్నారు. 

పారిశ్రామిక, లాజిస్టిక్ పార్కులు, షుగర్ మిల్ వంటి ప్రాంతాలకు కూడా మంచి కనెక్టివిటీ అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. అదేవిధంగా ఎక్కడైనా తహసీల్, బ్లాక్ ప్రధాన కార్యాలయాలు 2-లేన్ రోడ్డుతో అనుసంధానించబడకపోతే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. అంతర్రాష్ట్రాల మధ్యే కాదు అంతర్జాతీయ కనెక్టివిటీని మెరుగుపరచడానికి పనులు కొనసాగుతున్నాయని సీఎం యోగి తెలిపారు. 

రాష్ట్ర సరిహద్దుల్లో 'మైత్రి ద్వార్'లను కూడా నిర్మించనున్నామని ... ఈ విషయంలో కూడా ప్రజాప్రతినిధులు తమ ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం కోరారు. సమావేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న రోడ్ల మరమ్మతులు, గుంతల నిర్మూలన కోసం రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమంలో తొలి దశను అక్టోబర్ 10లోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. భారీ వాహనాల ఓవర్‌లోడింగ్‌పై చర్యలు తీసుకోవడానికి 'జీరో పాయింట్' వద్ద చురుగ్గా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు.

రోడ్డుపై సాధారణ రాకపోకలకు అంతరాయం కలిగించి తనిఖీలు చేయడం కంటే, వాహనం ఎక్కడ నుండి బయలుదేరిందో అక్కడే చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. సమావేశంలో అన్ని జోన్లు, డివిజన్లు, రేంజ్‌లు, జిల్లాలకు చెందిన పరిపాలనా అధికారులు హాజరయ్యారు.

click me!