కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు!.. యడ్డీ స్థానంలో కొత్త సీఎం !

By AN TeluguFirst Published Nov 30, 2020, 1:58 PM IST
Highlights

సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో కర్మ, కర్త, క్రియ అన్నీ తానై వ్యవహరించిన యడియూరప్పకు ప్రభుత్వ ఏర్పాటు అనంతరం కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. 

సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో కర్మ, కర్త, క్రియ అన్నీ తానై వ్యవహరించిన యడియూరప్పకు ప్రభుత్వ ఏర్పాటు అనంతరం కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. గత కొంతకాలంగా కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం మార్పు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన స్థానంలో ఓ యువకుడికి సీఎం పదవి కట్టబెట్టబోతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 సీఎం బీఎస్‌ యడియూరప్ప(77) వయసు పెరిగిపోయిందని, పనిలో చురుకుదనం లోపించిందని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలోనూ కొందరు అమాత్యులు యడ్డీపై గుర్రుగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 

కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలో చాలామందికి మంత్రిపదవులు కట్టాబెట్టారు. అయితే సీఎం నిర్ణయం సొంత పార్టీ నేతలకు ఏమాత్రం మింగుడుపడటంలేదు. ఎంతో కాలంగా పార్టీలో కొనసాగుతున్న తమను కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి మంత్రి పదవులు ఇవ్వడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ఈ విషయం తెలిసిన యడయ్యూరప్ప కొద్దికాలంలో మంత్రివర్గాన్ని విస్తరిస్తానని అసంతృప్తులకు నచ్చజెప్పారు. అయితే ఏడాది గడుస్తున్నా కేబినెట్‌ విస్తరణ చేపట్టకపోవడంతో అసంతృప్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యడ్డీని వెంటనే సీఎం కుర్చి నుంచి దించివేయాలని ఓ సమావేశాన్ని సైతం ఏర్పాటు చేసుకుని రహస్య తీర్మానం చేశారు. 

ఇదిలా ఉంటే కరోనా విపత్తుతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా భారీ వరదలు ఆయనకు మరింత తలనొప్పిని తెచ్చిపెట్టాయి. దీంతో సీఎం పీఠం మార్పు అనే వార్తలు మరోసారి ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పెద్దల నుంచి పిలుపందుకున్న యడియూరప్ప రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరించారు. 

ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను సీఎం వెల్లడించకపోవడంతో యడ్డీ స్థానంలో కొత్త సీఎంను నియమించేందుకు కేంద్ర పెద్దలు సిద్ధమయ్యారనే టాక్‌ వినిపించింది. 

ఆయన స్థానంలో ఓ యువనేతకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని కన్నడ వర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలో మహారాష్ట్ర, త్రిపుర, గోవాలో అనుసరించిన వ్యూహాన్ని ఇక్కడా అమలు చేయాలని బీజేపీ పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం. పార్టీ సిద్ధాంతాల ప్రకారం 75 ఏళ్లు పైబడిన వారు ఎవరూ కూడా పార్టీ పదవుల్లో ఉండకూడదు. ఈ నియమాన్ని అనుసరించే 77 ఏళ్ల యడ్డీని సీఎం పదవీ బాధ్యతల నుంచి తప్పిస్తారని చర్చ సాగుతోంది. 

మరోవైపు సీఎం మార్పు వార్తలను బీజేపీ కర్ణాటక చీఫ్‌ నలిన్‌ కుమార్‌ కాటిల్‌ కొట్టిపారేశారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు (డిసెంబర్‌) ముగిసే వరకు సీఎం మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకునేదిలేదని తేల్చిచెప్పారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని స్పష్టం చేశారు.

click me!