సీఎంగా యడియూరప్ప ప్రమాణం, మెుక్కులు చెల్లించుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే

By Nagaraju penumalaFirst Published Jul 27, 2019, 11:41 AM IST
Highlights

ఇదిలా ఉంటే కర్ణాటక ముఖ్యమంత్రిగా యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన  తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లి మరీ స్వామిని దర్శించుకున్నారు.
 

బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. దాదాపు మూడు వారాలుగా రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభానికి రెండు రోజుల క్రితం ముగింపు పలికింది. కాంగ్రెస్ జేడీఎస్ కూటమి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది.

కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ శాసన సభాపక్ష నేత యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కర్ణాటక రాజకీయాల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ముగ్గురు రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో ఇప్పుడు స్పీకర్ ను కొనసాగించాలా వద్దా అన్న చర్చ జరుగుతోంది. 

మిగిలిన రెబెల్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటూ ఆయా పార్టీల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే తమ వెనుక సిద్ధరామయ్య ఉన్నారంటూ కొందరు రెబెల్ ఎమ్మెల్యేలు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కర్ణాటక రాజకీయాల్లో మధ్యంతరం తప్పేలా లేదంటూ సిద్ధరామ్య చేస్తున్న వ్యాఖ్యలు మెుత్తం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. 

ఇదిలా ఉంటే కర్ణాటక ముఖ్యమంత్రిగా యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన  తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లి మరీ స్వామిని దర్శించుకున్నారు.

యడియూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్నిగంటల్లోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన హాస్పేట్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ స్వామివారిని దర్శించుకోవడం కన్నడ నాట ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇకపోతే ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ ఇటీవలే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.  

జిందాల్‌కు భూమి ఇవ్వరాదని, హాస్పేట్‌ను విజయనగర జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్‌తో ఆనంద్‌ సింగ్‌ జూలై ఒకటో తేదీన తన ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశారు. అనంతరం వివిధ నియోజకవర్గాలకు చెందిన 13 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.  

ఇటీవల జరిగిన బలనిరూపణ పరీక్షకు సైతం హాజరు కాలేదు. సొంత నియోజకవర్గంలో ఉన్నప్పటికీ బలనిరూపణకు గైర్హాజరయ్యారు. హాస్పేట్ ను విజయనగర జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ తో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 

ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన నేపథ్యంలో ఆనంద్ సింగ్ పై కూడా అనర్హత వేటు వేస్తారా అన్న చర్చ జరుగుతుంది. లేకపోతే ఆనంద్ సింగ్ రాజీనామాను స్వీకరిస్తారా అనే చర్చ కన్నడ రాజీకయాల్లో జోరుగా సాగుతుంది.  

click me!