ఐటి కంపెనీల స్టాఫ్ జులై 31 వరకు ఇంటి నుంచే... కేంద్రం ప్రకటన

By telugu news teamFirst Published Apr 29, 2020, 8:57 AM IST
Highlights

మళ్లీ లాక్ డౌన్ తర్వాత వీరంతా ఆఫీసులకు వెళ్లక తప్పదు. అప్పుడు కరోనా మళ్లీ తిరగపెట్టే ప్రమాదం లేకపోలేదు.ఈ క్రమంలో ఉద్యోగులకు కొంతకాలం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడమే బెటర్ అని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకీ విలయతాండవం చేస్తోంది. లాక్ డౌన్ విధించినప్పటికీ కేసుల సంఖ్య పెరగుతోంది. ఈ నేపథ్యంలో.. మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించారు. ఎలాంటి సడలింపులు లేకుండా లాక్ డౌన్ కొనసాగిస్తున్నప్పటికీ... కేసుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ కలవరపెడుతోంది.

ఈ లాక్ డౌన్ కారణంగా జర్నలిస్టులు, వైద్యులు, పోలీసులు తప్ప.. మరెవరీ ఆఫీసులకు వెళ్లి విధులు నిర్వహించడం లేదు. ముఖ్యంగా ఐటీ కంపెనీల ఉద్యోగులైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ని వాడుకుంటున్నారు. మళ్లీ లాక్ డౌన్ తర్వాత వీరంతా ఆఫీసులకు వెళ్లక తప్పదు. అప్పుడు కరోనా మళ్లీ తిరగపెట్టే ప్రమాదం లేకపోలేదు.

ఈ క్రమంలో ఉద్యోగులకు కొంతకాలం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడమే బెటర్ అని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ క్రమంలోనే దేశంలోని ఐటీ, బీపీఓ సంస్థలోని ఉద్యోగులు జులై 31 వరకు ఇళ్ల నుంచి విధులు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో.. అన్ని రాష్ట్రాల ఐటీ మంత్రులతో నిర్వహించిన సమావేశంలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విషయం వెల్లడించారు. 

దేశంలోని ఐటీ, బీపీఓ కంపెనీ నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వర్క్ ఫ్రమ్ హోం గడువును జులై 31 వరకు పెంచామని వెల్లడించారు. కరోనా తగ్గేది ఎన్నడో అందరు సంతోషంగా ఎప్పుడు ఉంటారోనని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు. 

వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అశ్వథ్ నారాయణ మాట్లాడుతూ... వర్క్ ఫ్రమ్ హోమ్‌ను మార్చి 31, 2021 వరకు అంటే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు ఇవ్వాలని కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్‌ను కోరారు. దీనికి రవిశంకర ప్రసాద్ స్పందిస్తూ.. జూలై చివరలో దీని గురించి ఆలోచిద్దామన్నారు.

వర్క్ ఫ్రమ్ హోమ్ దృష్ట్యా భారత్ నెట్ కింద ఇంటర్నెట్ సర్వీస్ మరింత బలపరుస్తామని రవిశంకర ప్రసాద్ చెప్పారు. దాదాపు 80 శాతం నుండి 90 శాతం ఐటీ కంపెనీలు ఇంటి వద్ద నుండి పని చేస్తున్నాయి. కాగా, అంతకుముందు మార్చి నెలలో ఏప్రిల్ 30వ తేదీ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు దీనిని పొడిగించింది.

click me!