కట్నం కోసం.. కడుపు మాడ్చారు, ఆకలితో ప్రాణాలు విడిచిన కోడలు

By Siva KodatiFirst Published Mar 31, 2019, 9:49 AM IST
Highlights

ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా దేశంలో వరకట్న వేధింపులు ఆగకపోగా.. మరింత పెరుగుతున్నాయి. తాజాగా కట్నం తీసుకురాలేదని కోడలిని కడుపు మాడ్చి చంపారు

ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా దేశంలో వరకట్న వేధింపులు ఆగకపోగా.. మరింత పెరుగుతున్నాయి. తాజాగా కట్నం తీసుకురాలేదని కోడలిని కడుపు మాడ్చి చంపారు.

వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొల్లాం సమీపంలోని కరునాగపల్లికి చెందిన తుషారకు 2013లో చందూలాల్‌తో వివాహం జరిగింది. ఆ సమయంలో కొంత డబ్బు, బంగారు ఆభరణాలు ఇచ్చారు.

మరో రూ.2 లక్షలు తర్వాత ఇస్తామని మాటిచ్చారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం.. ఈ క్రమంలో అత్తింటి వారు ఆమెను కట్నం కోసం వేధించసాగారు. కొద్దిరోజులుగా భోజనం పెట్టకపోవడంతో ఆమె నానబెట్టిన బియ్యం, పంచదార నీటితో ఆకలి తీర్చుకున్నారు.

చివరికి చిక్కి శల్యమైన ఆమె ఎముకల గూడులా మారిపోయారు. ఆరోగ్యం విషమించడంతో ప్రభుత్వాసుపత్రిలో తుదిశ్వాస విడిచింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా, అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.

అత్తింటి వారు గత ఐదేళ్లుగా తుషారను కట్నం కోసం వేధిస్తున్నారని, ఏడాది కాలంగా తమ కుమార్తెను కలుసుకోనీయలేదని ఆమె తల్లి విజయలక్ష్మీ ఆరోపించారు. తమ కుమార్తెను హింసిస్తున్నట్లు తెలిసినా... ఆమె జీవితం నాశనమవుతుందనే భయంతోనే తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు.

అత్త, భర్త తుషారను వేధించినట్లు పోరుగింటి వారు కూడా ధ్రువీకరించడంతో భర్త చందూలాల్, అత్త గీతాలాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు చనిపోయే సమయానికి వివాహిత శరీరంపై కండరాలు లేవని, 20 కిలోల బరువుతో ఎముకల గూడులా ఉన్నారని పోలీసులు తెలిపారు. 

click me!