ఇంటి అద్దె చెల్లించలేదని కత్తితో దాడి: యజమాని అరెస్ట్

By narsimha lodeFirst Published Nov 1, 2020, 5:03 PM IST
Highlights

ఇంటి అద్దె చెల్లించలేదనే కారణంగా ఓ ఇంటి యజమాని ఇంట్లో అద్దెకుంటున్న మహిళపై కత్తితో దాడి చేశాడు.  తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.

బెంగుళూరు: ఇంటి అద్దె చెల్లించలేదనే కారణంగా ఓ ఇంటి యజమాని ఇంట్లో అద్దెకుంటున్న మహిళపై కత్తితో దాడి చేశాడు.  తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.

పట్టణంలోని మారుతీనగర్ లో ఏడాది క్రితం నుండి పూర్ణిమ తన భర్త రవిచంద్రతో కలిసి నివాసం ఉంటుంది. పూర్ణిమ భర్త ఓ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు.

వీరు అద్దెకు దిగే సమయంలో అడ్వాన్స్ కింద  కొంత నగదును చెల్లించారు. ప్రతి నెల రూ. 6 వేలు అద్దె కింద చెల్లించేవారు.

కరోనా కారణంగా రవిచంద్ర ఉద్యోగం పోయింది.  దీంతో గత నాలుగు నెలల నుండి పూర్ణిమ అద్దె చెల్లించలేదు. దీంతో ఇంటి యజమాని మహాలక్ష్మి వాళ్ల దగ్గరికి వెళ్లి అద్దె కోసం నిలదీసింది.

ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ మరో నెల గడువును ఇవ్వాలని కోరింది. లేదా తాము చెల్లించిన అడ్వాన్స్ నుండి అద్దెను కట్ చేసుకోవాలని కోరింది.అయితే ఇంటి యజమానురాలు మహాలక్ష్మి మాత్రం పూర్ణిమతో వాగ్వావాదానికి దిగింది.  తనకు అద్దె చెల్లించాలని ఇంటి యజమానురాలు తేల్చి చెప్పింది.

కోపం తట్టుకోలేక పోయిన మహాలక్ష్మి కూరగాయలు కోసే కత్తి తెచ్చి పూర్ణిమ చేతులు, మెడపై దాడి చేసింది. రవిచంద్ర వచ్చి అడ్డుకోవడంతో మహాలక్ష్మి వెళ్లిపోయింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

బాధితుల ఫిర్యాదు మేరకు మహాలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు.


 

click me!