
దేశ రాజధాని ఢిల్లీలోని రైల్వే స్టేషన్ వద్ద ఒక మహిళా ఉపాధ్యాయురాలు విద్యుదాఘాతంతో మరణించింది. ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. తూర్పు ఢిల్లీలోని ప్రీత్ విహార్‌లో సాక్షి అహుజా కుటుంబం నివాసం ఉంటుంది. ఆమె లక్ష్మీ నగర్‌లోని ఒక పాఠశాలలో బోధించేవారు. అలాగే ఆమె ఆర్కిటెక్ట్ కూడా. అయితే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో చండీగఢ్ వెళ్లేందుకు ఆమె తన కుటుంబంతో ఉదయం 5.30 గంటలకు స్టేషన్‌కు వచ్చింది. సాక్షి తల్లిదండ్రులు, ఆమె సోదరుడు కార్క్ పార్క్ చేస్తుండగా.. ఆమె తన సోదరి మాద్వి, పిల్లలతో కలిసి ప్లాట్‌ఫారమ్‌కు వెళ్లేందుకు బయలుదేరింది.
ఆమె టాక్సీ పార్కింగ్ స్థలం నుంచి రైల్వే స్టేషన్‌లోని వెళ్లే మార్గంలో రోడ్డుపై భారీగా నీరు నిలించింది. నీటిలో జారిపోకుండా ఉండేందుకు ఆమె స్తంభాన్ని పట్టుకుంది. ఈ క్రమంలోనే ఆమె విద్యుదాఘాతానికి గురైంది. అయితే సాక్షిని రక్షించే ప్రయత్నాల్లో ఆమె సోదరి కూడా విద్యుతాఘాతానికి గురైంది. వారి కేకలు విన్న ఆటో, క్యాబ్ డ్రైవర్లు వెంటనే అక్కడికి పరుగెత్తారు. అయితే ఆమెను రక్షించలేకపోయారు. ఈ ప్రమాదం నుంచి మాద్వి ప్రాణాలతో బయటపడింది. సాక్షి పక్కనే నిలబడి ఉన్న ఆమె 9 ఏళ్ల కుమారుడు, 7 ఏళ్ల కుమార్తె సకాలంలో రక్షించబడ్డారు. ఈ ఘటన ఉదయం 5.40 గంటల ప్రాంతంలో జరిగిందని అక్కడివారు తెలిపారు. అయితే విద్యుతాఘాతానికి గురైన తర్వాత కొంతసేపు నేలపై పడి కొట్టుకోవడం కనిపించిందని చెప్పారు.
‘‘మేము సెలవుల కోసం చండీగఢ్ వెళ్తున్నాము. విద్యుదాఘాతానికి గురై నా కూతురు చనిపోయిందన్న వార్త వచ్చినప్పుడు నేను పార్కింగ్ ఏరియాలో ఉన్నాను. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది’’ అని సాక్షి తండ్రి లోకేష్ కుమార్ చోప్రా అన్నారు. ఈ ప్రమాదానికి అనేక శాఖల అధికారులు బాధ్యులని సాక్షి భర్త అంకిత్ అహుజా తెలిపారు. రైల్వే శాఖ అధికారులు మమ్మల్ని కలవడానికి వచ్చి విచారణ జరుగుతోందని హామీ ఇచ్చారని చెప్పారు.
ఇక, ఈ ఘటనకు సంబంధించి మెషినరీ నిర్వణణకు సంబంధించిన నిర్లక్ష్యం, నిర్లక్ష్య ప్రవర్తన కారణంగా మరణానికి కారణమైనందుకు సంబంధించి సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడిందని డీసీపీ (రైల్వేస్) అపూర్వ గుప్తా తెలిపారు. అయితే సంఘటనా స్థలానికి కొన్ని మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ సకాలంలో ఎవరూ రాలేదని కుటుంబీకులు వాపోయారు. అయితే ఈ ఆరోపణలను డీసీపీ ఖండించారు. ఒక బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. లేడీ హార్డింగ్ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతోందని పేర్కొన్నారు.
ఇక, ఘటనా స్థలం నుంచి సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో పాల్గొనాల్సిందిగా స్టేషన్‌లోని మెయింటెనెన్స్ విభాగం అధికారులకు నోటీసులు పంపనున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.