
Aligarh woman gang rape: దేశంలో మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు తీసుకువస్తున్నప్పటికీ.. వాటి అమలు సరిగ్గా లేని కారణంగా..మహిళలపై అఘాయిత్యాలు, దాడులు, హింస కొనసాగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో మహిళల రక్షణపై ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇటీవల వరుసగా చోటుచేసుంటున్న మహిళలపై దాడులు, హింస, అత్యాచారాలు ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్‌లో కదులుతున్న ఆటోలో ఓ మహిళపై లైంగికదాడి జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. యూపీలోని అలీగఢ్ జిల్లాలో ఓ మహిళపై ఆటోరిక్షా డ్రైవర్, అతని సహచరులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలి వద్ద ఉన్న రూ.20 వేలు దోచుకుని నిందితులు పరారయ్యారు. బాధిత మహిళపై లైంగికదాడి అనంతరం నిందితులు అలీగఢ్‌లోని అక్బరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నానౌ ప్రాంతంలో మహిళను పడేశారు. ఏప్రిల్ 14వ తేదీ తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. నేరం గురించి సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించారు. బాధిత మహిళ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేసుకున్నారు. దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. అలీఘర్‌లోని అక్బరాబాద్ ప్రాంతానికి చెందిన మహిళ ప్రస్తుతం తన భర్త, పిల్లలతో కలిసి న్యూఢిల్లీలో నివసిస్తోంది.
గురువారం ఆమె ఢిల్లీ నుంచి బస్సులో అలీగఢ్ వచ్చారు. దీంతో బాధితురాలు టాక్సీ ఆటోలో గాంధీ పార్క్ బస్ స్టాండ్ వద్ద ఎక్కారు. ఆటోరిక్షాలో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు ఉన్నారు. మార్గమధ్యంలో ఆటోలో నుంచి ప్రయాణికుల్లో ఒకరు దిగిన తర్వాత నిందితులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ తెలిపింది. తన వద్ద ఉన్న రూ.20 వేలు కూడా దోచుకెళ్లారని పేర్కొంది. లైంగికదాడిని ప్రతిఘటించడంతో నిందితులు తనను తీవ్రంగా కొట్టారని బాధితురాలు ఆరోపించింది. ఆ మహిళ నేరం గురించి పోలీసులకు సమాచారం అందించింది. గాయపడిన సదరు బాధితురాలికి ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. సామూహిక లైంగికదాడి, దోపిడీ ఆరోపణలపై ఆటోడ్రైవర్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు అలీగఢ్ ఎస్‌ఎస్పీ కళానిధి నైతానీ తెలిపారు. గాంధీపార్క్ బస్టాండ్, అక్బరాబాద్‌కు వెళ్లే రహదారిలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.
ఇదిలావుండగా, 13 ఏళ్ల చిన్నారిపై 8 నెలలుగా 80 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకెళ్తే.. కరోనా మహమ్మారితో ఆస్పత్రిలో చేరిన మహిళను పరిచయం చేసుకుని.. ఆమె కూతురిని దత్తత తీసుకుంటున్నట్టు నటించింది. సదరు మహిళ.. ఆమె చనిపోయాక చిన్నారిని తీసుకెళ్లి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపింది. గుంటూరులో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనకు సంబంధించి.. ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 80 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు విదేశాల్లో ఉన్నారని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులపై లుకౌట్ నోటీసులు జారీ చేశామని గుంటూరు అడిషనల్ ఎస్పీ సుప్రజ తెలిపారు.