మధ్యప్రదేశ్‌లో దారుణం.. డీజిల్ లేక ఆగిపోయిన అంబులెన్స్.. టార్చ్ వెలుగులో రోడ్డు మీద ప్రసవం.. 

By Rajesh KarampooriFirst Published Oct 30, 2022, 4:51 AM IST
Highlights

బుందేల్‌ఖండ్‌లోని పన్నా జిల్లాలో గర్భిణిని తీసుకెళ్తున్న అంబులెన్స్‌లో డీజిల్‌ అయిపోయింది. ప్రసవ నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి మధ్య మార్గంలో అంబులెన్స్ హెడ్ లైట్ వెలుగులో ప్రసవం చేయాల్సి వచ్చింది. దాదాపు రెండు గంటల పాటు ఈ గర్బిణీ నరకయాతన అనుభవించింది. 

మధ్యప్రదేశ్‌లో ఆరోగ్య వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో.. ఈ ఒక ఘటనతో అర్థమవుతోంది. ప్రసవ వేదనతో ఓ గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా  అంబులెన్స్ లో డీజిల్ అయిపోవడంతో మార్గమధ్యంలో నిలిపివేశారు. దీంతో ఆ మహిళ మార్గమధ్యంలో ప్రసవించవలసి వచ్చింది. ఈ దారుణమైన ఘటన పన్నా జిల్లాలోని షానగర్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే.. బనౌలి గ్రామానికి చెందిన రేష్మకు ప్రసవ నొప్పి రావడంతో కుటుంబసభ్యులు అత్యవసర సౌకర్యం కోసం 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అంబులెన్స్ గ్రామానికి చేరుకుని మహిళను షానగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలిస్తున్నారు. కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు చేరుకునేలోపే..దారిలో అంబులెన్స్ డీజిల్ అయిపోయింది. దీంతో అంబులెన్స్ నిర్జన ప్రదేశంలో ఆగిపోయింది. మరొకరి సహాయం అడగడం కూడా సాధ్యం కాదు. అటువంటి పరిస్థితిలో.. ఆ గర్భవతి బాధ వర్ణనీతం.దీంతో కుటుంబ సభ్యులు రేష్మను నడిరోడ్డులోనే ప్రసవించాలని నిర్ణయించుకున్నారు. టార్చ్ వెలుగులో రేష్మ తన బిడ్డకు జన్మనిచ్చింది. రాష్ట్రంలో ఆరోగ్య సేవల దుస్థితి ప్రభుత్వ వాదనలన్నింటినీ బట్టబయలు చేస్తోంది.

మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం ఇదే తొలిసారి కాదు.ఇంతకుముందు.. కొన్ని నెలల క్రితం దాబో ప్రాంతంలో ఇలాంటి కేసు తెరపైకి వచ్చింది. ఓ వృద్ధుడి ఆరోగ్యం క్షీణించింది. అతడిని ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబసభ్యులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. ఎంత వేచి చూసినా అంబులెన్స్ రాలేదు. దీంతో ఆ వృద్ధుడి పెద్ద కొడుకు హరి సింగ్  తోపుడు బండి తీసుకొని దాని మీద తన తండ్రిని పడుకోబెట్టి, బండిని 5 కిలోమీటర్లు నెట్టి ఆసుపత్రికి చేరుకున్నాడు. ఈ ఉదంతం మర్పూర గ్రామంలో చోటుచేసుకుంది.  

click me!