
కర్ణాటక : ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించిన వారిని ఉప్పు పాతర వేస్తే ప్రాణాలు తిరిగి వస్తాయనే మూఢనమ్మకం కర్ణాటకలో నేటికీ కొనసాగుతుంది. ఇటీవల బళ్లారిలో ఓ బాలుడి మృతదేహాన్ని ఉప్పుపాతర వేయడం మరిచిపోకముందే.. చిక్కబళ్లాపుర జిల్లాలోనూ అదే తరహా ఘటన చోటుచేసుకుంది. శిడ్లఘట్ట తాలూకాలోని గాజులవారిపల్లెకు చెందిన ఎంఏ విద్యార్థిని అమృత (22) గంగానహళ్లిలోని బంధువుల ఇంటికి వచ్చింది. ఆమె ఆదివారం ఉదయం గ్రామంలోని చెరువు వద్ద సరదాగా రీల్స్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు జారి నీటిలో మునిగిపోయింది.
సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్నవారు వెంటనే ఇది గమనించి.. ఆమె దగ్గరికి వచ్చి.. అమృతను ఒడ్డుకు తీసుకువచ్చారు. అయితే అప్పటికే ఆమె చనిపోయింది. అయినప్పటికీ బంధువులు ఉప్పు పాతర వేస్తే ఆమె బతుకుతుంది అనే నమ్మకంతో అమృత మృతదేహాన్ని ఉప్పులో పెట్టారు. గుడిబండ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 6న ఇలాంటి ఘటనే కర్ణాటకలోనే జరిగింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచం ఎంత అభివృద్ధి చెందుతున్నా.. గుహలో నివసించిన మానవుడు గ్రహాంతర లోకాల్లో కాలు మోపుతున్నా... కొన్ని చోట్ల మూఢనమ్మకాలు, వింత ఆచారాలు ఇంకా రాజ్యమేలుతూనే ఉన్నాయి. కొంతమంది చేతబడులు, మూఢనమ్మకాలు, వింత ఆచారాల నెపంతో ఇతరులపై పైశాచికత్వాన్ని రుద్దుతున్నారు. అలాంటి మూఢనమ్మకాలను నిర్మూలించడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా కొందరు మాత్రం మూఢనమ్మకాలను గుడ్డిగా ఆచరిస్తున్నారు.
కర్ణాటకలో జరిగిన ఓ అమానుష ఘటన ఇందుకు నిదర్శనం. కర్ణాటకలోని బళ్ళారి తాలూకాలోని సిరివార గ్రామానికి చెందిన శేఖర్, గంగమ్మ దంపతుల చిన్న కుమారుడు భాస్కర్ (10). ఆ చిన్నారి గత సోమవారం తన స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి, ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నీట్లో గాలించగా, తమ కుమారుడిని మృతదేహం దొరికింది.
భార్యపై అనుమానం.. చంపి, ఉప్పు పాతరేసిన భర్త
అయితే నీటిలో పడి మరణించినవారిని రెండు గంటల్లోగా ఉప్పులో పాతి పెడితే బతుకుతారనే మూఢనమ్మకంతో.. వారు తమ కొడుకు మృతదేహాన్ని ఉప్పుతో కప్పి పెట్టారు. ఇందుకోసం దాదాపు 100 కేజీల ఉప్పును ఉపయోగించారు. తమ కొడుకు ఎలాగైనా కళ్లు తెరుస్తాడని, బతికి వస్తాడని సుమారు ఎనిమిది గంటలపాటు ఎదురుచూశారు. ఈ వింత గురించి తెలుసుకున్న గ్రామ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత బాలుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు, ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.