
న్యూఢిల్లీ: మహిళా సాధికారతకు ఎన్నో అడ్డంకులు. మహిళలపట్ల ఇప్పటికీ ఎన్నో జాఢ్యాలు. వారి కాళ్ల మీద వారు నిలబడటానికీ సొంత వారి నుంచే సవాళ్లు. ఓ మహిళ భర్తకు తోడుగా ఉద్యోగం చేస్తానని ఇంటర్వ్యూ కోసం సిద్ధమైంది. అది వారి అత్తగారింట్లో పెద్ద దుమారానికి కారణమైంది. ఆమె ఉద్యోగం చేయడానికి వీల్లేదని ఆమె మామ నానా రచ్చ చేశాడు. ఇంటర్వ్యూ కోసం బయల్దేరిన ఆమెపై ఏకంగా ఇటుకతో దాడి చేశాడు. ఇదేదో మారుమూల గ్రామంలో జరిగిన ఘటనా కాదు.. దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోవడం గమనార్హం.
నార్త్‌వెస్ట్ ఢిల్లీలో 26 ఏళ్ల మహిళపై ఆమె మామ మంగళవారం ఇటుకతో దాడికి దిగాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
భర్త ప్రవీణ్ కుమార్‌కు సహాయంగా తాను కూడా పని చేయాలని భార్య కాజల్ అనుకుంది. ఆ తర్వాత మంగళవారం ఓ జాబ్ ఇంటర్వ్యూ కోసం బయటకు బయల్దేరి వెళ్లింది. ఇంటర్వ్యూకు వెళ్లుతుండగా మామ దారి మధ్యలో ఆమెకు అడ్డుగా వచ్చాడు. ఆమెతో వాదించాడు. ఆమె మామను తప్పించుకుని ఇంటర్వ్యూకు వెళ్లాలని అనుకుంది. కానీ, అతను అడ్డగించాడు. అయినా.. ఆగకపోవడంతో వెంట తెచ్చిన ఇటుకతో ఆమె తలపై బలంగా కొట్టాడు. ఆమె హతాశయురాలైంది. చేతులు అడ్డంగా పెట్టుకుంది. అయినా.. మరో దెబ్బేశాడు. ఇంతలో అక్కడి నుంచి పారిపోయేందుకు రెడీ అయింది. ఆమె వెంటే అతడు కూడా ఇటుకతో పరుగు పెట్టాడు.
Also Read: హృదయవిదారకం.. యజమాని చనిపోయి 3 నెలలైనా.. ఆస్పత్రి ఎదుటే పెంపుడుకుక్క ఎదురుచూపు...
కాజల్‌ను సంజయ్ గాంధీ హాస్పిటల్‌కు భర్త ప్రవీణ్ తీసుకెళ్లాడు. ఆమె తల పై 17 కుట్లు పడ్డాయి. దాడి చేసిన వ్యక్తిపై ఫరీదాబాద్‌లో నివసించే కాజల్ తల్లిదండ్రులు కేసు పెట్టారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్టు అధికారులు వివరించారు.