రైతుల నిరసన ప్రదర్శనకు వెళ్లిన మహిళపై హర్యానాలో అత్యాచారం

By telugu teamFirst Published May 10, 2021, 8:22 AM IST
Highlights

రైతుల నిరసన ప్రదర్శనకు వెళ్లిన మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసినట్లు ఆమె తండ్రి ఫిర్యాదు చేశారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఆ పాతికేళ్ల యువతి ఏప్రిల్ 30వ తేదీన ఆస్పత్రిలో మరణించింది.

చండీగఢ్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ఇటీవల కోవిడ్ లక్షణాలతో హర్యానాలోని ఆస్పత్రిలో మరణించింది. అయితే, టిక్రీలో జరుగుతున్న నిరసన ప్రదర్శనకు వెళ్తున్న ఆ మహిళపై అత్యాచారం జరిగిందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

పాతికేళ్ల వయస్సు గల ఆ మహిళపై అత్యాచారం జరిగిందని ఆమె తండ్రి చేసిన ఫిర్యాదుతో ఇద్దరు నిందితులను పట్టుకోవడానికి పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ప్రదర్శనలో పాల్గొనడానికి మహిళ ఓ బృందంతో ఏప్రిల్ 10వ తేదీన టిక్రీ వెళ్లిందని ఫిర్యాదులో తెలిపారు.

మహిళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.... కోవిడ్ లక్షణాలు ఉండడంతో ఆ యువతిని ఏప్రిల్ 26వ తేదీన ఝాజ్జర్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. ఆమె ఏప్రిల్ 30వ తేదీన మరణించింది. దాంతో యువతి తండ్రి తమకు ఫిర్యాదు చేశాడని బహదూర్ గఢ్ పోలీసు అధికారి విజయ్ కుమార్ చెప్పారు. 

రైతుల నిరసనకు మద్దతు తెలపడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు తన కూతురిపై అత్యాచారం చేశారని ఆమె తండ్రి ఫిర్యాదు చేశాడు. తనకు ఫోన్ తన కూతురు విషయమంతా చెప్పిందని అన్నాడు. 

కోవిడ్ తో యువతి మరణించిందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయని, డాక్యుమెంట్ల కోసం తాము దరఖాస్తు చేసుకున్నామని, వాటి కోసం తాము ఎదురు చూస్తున్నామని, అవి వచ్చిన తర్వాత ఆమె మరణించిందనేది తేలుతుందని విజయ్ కుమార్ చెప్పారు. 

click me!