
Punjab New Advocate General: పంజాబ్ నూతన అడ్వకేట్ జనరల్‌గా అన్మోల్ రతన్ సిద్ధూ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇండియా టుడేకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన వేతనం ప్రభుత్వానికి భారంగా మారకుండా.. కేవలం రూ. 1 మాత్రమే జీతంగా తీసుకుంటామని పంజాబ్ కొత్త అడ్వకేట్ జనరల్ చెప్పారు. ప్రభుత్వం తరుపున కేసులను పూర్తి పారదర్శకతతో వాదిస్తానని, కేసులను పరిష్కరించేటప్పుడు రాష్ట్ర ఖర్చులపై భారం వేయనని చెప్పారు.
అన్మోల్ రతన్ సిద్ధూ సుధీర్ఘకాలంగా న్యాయ వాద వృతిలో కొనసాగుతున్నారు. తన ప్రతిభగల కెరీర్‌లో.. పంజాబ్ మరియు హర్యానా హైకోర్టులో అత్యంత సున్నితమైన కేసులతో పాటు రాజ్యాంగ, క్రిమినల్, సివిల్ సర్వీస్, భూవివాదాల కేసులను వాదించారు. రతన్ సిద్ధూ అసాధారణమైన సేవలకు గాను పంజాబ్ ప్రభుత్వం ఆయనకు ఆ రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం 'పర్మాన్ పాత్ర'ను అందుకున్నారు.
రతన్ సిద్ధూ మే 1, 1958న ఓ రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన తన గ్రాడ్యూవేషన్ పూర్తి అయిన తరువాత పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. సిద్ధూ సామాజిక-రాజకీయ ఆంశాల్లో చాలా చురుకుగా పాల్గొనే వారు. 1981-1982 కాలంలో పంజాబ్ యూనివర్సిటీ స్టూడెంట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. 1985లో ఆయన న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టారు. తరువాత 1993లో పంజాబ్ డిప్యూటీ అడ్వకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. 2005వరకు అదే హోదాలో కొనసాగారు. అదే సమయంలో 2003-04లో పంజాబ్ యూనివర్సిటీ డీన్ ఫ్యాకల్టీగా కూడా పనిచేశారు.
సిద్ధూ 2001-02లో అపెక్స్ రెగ్యులేటింగ్ బాడీ ఆఫ్ లాయర్ల ఛైర్మన్‌గా ఎదగడానికి ముందు..వరుసగా ఐదు సార్లు పంజాబ్ మరియు హర్యానా బార్ కౌన్సిల్‌కు సభ్యునిగా ఎన్నికయ్యారు. హైకోర్టులో ప్రాక్టీస్ సమయంలో.. ఆయన ఎనిమిది సార్లు పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగాడు, దేశంలోని ఏ హైకోర్టులోనైనా ఇన్ని సార్లు ఎన్నికైన మొదటి వ్యక్తి ఘనత సాధించారు. అనంతరం 2007లో సీనియర్ న్యాయవాదిగా నియమించబడ్డాడు. తరువాత 2008 నుండి 2014 వరకు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేశాడు. ఈ పదవీకాలంలో పంజాబ్ మరియు హర్యానా హైకోర్టులో CBIకి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కూడా కొనసాగాడు.