సాగు చట్టాలపై ఆందోళనలు: ఢిల్లీలో రైతు మృతి.. కుటుంబసభ్యులపై కేసు

By Siva KodatiFirst Published Feb 5, 2021, 9:13 PM IST
Highlights

ఢిల్లీలో రైతు ఆందోళనల సందర్భంగా మరణించిన రైతు కుటుంబ సభ్యులపై పోలీసులు కేసులు నమోదు చేయడం వివాదాస్పదమైంది. 

ఢిల్లీలో రైతు ఆందోళనల సందర్భంగా మరణించిన రైతు కుటుంబ సభ్యులపై పోలీసులు కేసులు నమోదు చేయడం వివాదాస్పదమైంది.   వివరాల్లోకి వెళితే... బల్విందర్‌ సింగ్‌ అనే రైతు యూపీలోని భోపత్‌పూర్‌ గ్రామానికి చెందిన వారు.

ఈ క్రమంలో జనవరి 23న గాజీపూర్‌కు చేరుకున్న ఆయన.. అప్పటి నుంచి ఢిల్లీ శివార్లలో జరుగుతున్న రైతు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 1న ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు.. ఢిల్లీ పోలీసులు ఆయన కుటుంబానికి ఫోన్‌ ద్వారా తెలియజేశారు.

లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం, బల్విందర్ సింగ్‌ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అనంతరం ఆయన మృతదేహానికి బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు.

ఆ సమయంలో ఆయన శరీరంపై జాతీయ పతాకాన్ని కప్పారు. అయితే ఈ చర్య ‘ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇన్‌సల్ట్స్‌ టు నేషనల్‌ ఆనర్‌ యాక్ట్‌’ ప్రకారం చట్ట విరుద్ధమని.. ఈ కారణంగా ఆయన భార్య, సోదరుడు, మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే వ్యవసాయదారులు కూడా సైనికుల మాదిరిగానే దేశం కోసం పోరాడుతున్నారని.. రైతులకు మద్దతుగా తమ సోదరుడు, వారి కోసమే మరణించాడని బల్వీందర్ సింగ్ సోదరుడు వివరించారు. అందువల్లే ఆయన మృతదేహంపై జాతీయ పతాకాన్ని కప్పామని వెల్లడించారు.  

click me!