
Political strategist Prashant Kishore: రాజకీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శనివారం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తేజస్వి యాదవ్‌కు ఇప్పుడు అత్యున్నత పదవి ఇవ్వాలనీ, ఆయన నాయకత్వంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడటానికి 2025 వరకు వేచి ఉండవద్దని సూచించారు. 2025 వరకు ఎందుకు వేచి ఉండాలి? తేజస్వీ యాదవ్ ను ఇప్పుడే ముఖ్యమంత్రిని చేయండి అని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నితీష్ కుమార్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన.. తన పనితీరు ఆధారంగా బీహార్ ప్రజలు తనకు ఓటు వేయడానికి ఇది అవకాశం ఇస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు.
ఒక సభకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ, బీహార్ అసెంబ్లీలో తన రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అతిపెద్ద పార్టీ అయినందున ఇప్పుడు తేజస్వి యాదవ్‌కు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడం సమంజసమని పేర్కొన్నారు. దీనివల్ల బీహార్ ప్రజలు తన పనితీరు ఆధారంగా తనకు ఓటు వేసే అవకాశం ఉంటుందని ఆయన వాదించారు. తేజస్వి యాదవ్‌ను సీఎంగా ఎన్నుకునేందుకు 2025 వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. తమ కూటమిలో ఆర్జేడీకే ఎక్కువ వాటా ఉందనీ, నితీష్ కుమార్ ఆయన్‌ను సీఎం చేయాలి. ఇది తేజస్వికి మూడేళ్లపాటు పనిచేసే అవకాశం కల్పిస్తుందని తెలిపారు. అతని పనితీరు ఆధారంగా ప్రజలు ఓటు వేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
2025లో జరిగే తదుపరి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్ నేతృత్వంలో మహాఘట్బంధన్ పోటీ చేస్తుందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చెప్పిన కొద్ది రోజులకే ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. "నాకు దేశానికి ప్రధాని కావాలనే ఆశయం లేదు. నాకు ఒకే ఒక ఆశయం ఉంది.. బీజేపీని ఓడించి, కేంద్రం నుండి దానిని తొలగించడం. మనమందరం దానిపై పని చేస్తున్నాము. మేము 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో తేజస్వి యాదవ్ నాయకత్వంలో పోటీ చేస్తాము" అని ఇటీవల నితీష్ కుమార్ అన్నారు. తాను బీహార్, దాని ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాననీ, భవిష్యత్తులో మంచి పనులను కొనసాగించడం తన డిప్యూటీ తేజస్వి యాదవ్‌కు ఇప్పుడు వచ్చిందని ఆయన నొక్కి చెప్పారు. గతంలో అనేక సందర్భాల్లో, సీఎం నితీష్ కుమార్ భవిష్యత్తులో యువ తరం నాయకుడు తేజస్వి యాదవ్‌ను ప్రోత్సహించాలనుకుంటున్నట్లు బహిరంగంగా చెప్పారు. తాజాగా అసెంబ్లీలో కూడా ఇదే విషయాన్ని ఆయన ప్రకటించారు.