తెలుగు ఐఏఎస్‌ హత్యలో దోషిగా ఆనంద్ మోహన్.. అతడి విడుదలకు నితీశ్ సర్కార్ ఎందుకు సహకరించింది?

By Sumanth KanukulaFirst Published Apr 26, 2023, 10:06 AM IST
Highlights

గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు ఆనంద్ మోహన్ ఒక దళిత ఐఏఎస్ హత్య కేసులో దోషిగా నిర్దారించబడి ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే తాజాగా ఆనంద్ మోహన్ విడుదలకు బీహార్‌లోని నితీశ్ కుమార్ సర్కార్ మార్గం సుగమం చేసింది. 

పాట్నా: గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు ఆనంద్ మోహన్ పేరు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అతడు ఒక దళిత ఐఏఎస్ హత్య కేసులో దోషిగా నిర్దారించబడి ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే తాజాగా ఆనంద్ మోహన్ విడుదలకు బీహార్‌లోని నితీశ్ కుమార్ సర్కార్ మార్గం సుగమం చేసింది. అయితే డాన్ ఆనంద్ మోహన్ ఎవరు?.. అతడిని  జైలు నుంచి విడుదల వెనక చోటుచేసుకున్న పరిణామాలను ఒక పరిశీలిద్దాం. 1994లో బీహార్ పీపుల్స్ పార్టీ (ప్రస్తుతం ఉనికిలో లేదు) వ్యవస్థాపకుడు, డాన్ ఆనంద్ మోహన్ నేతృత్వంలోని ఒక గుంపు దళిత ఐఏఎస్ అధికారి, గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ జి కృష్ణయ్యను అతని కారు నుంచి బయటకు లాగి దారుణంగా కొట్టి చంపారు. కృష్ణయ్య తెలంగాణలోని దళిత కుటుంబంలో జన్మించారు. 

తోమర్ రాజ్‌పుత్‌ సామాజిక వర్గానికి  చెందిన ఆనంద్ మోహన్.. చాలా సంవత్సరాలుగా అనేక ఇతర తీవ్రమైన నేరాల కేసులను ఎదుర్కొంటున్నారు. 1996లో జైల్లో ఉన్నప్పుడే బీహార్‌లోని సియోహర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2007లో  పాట్నా హైకోర్టు ఆనంద్ మోహన్‌కు నేరాన్ని ప్రోత్సహించినందుకు మరణశిక్ష విధించింది. దీంతో స్వతంత్ర భారత చరిత్రలో మరణశిక్ష పడ్డ తొలి రాజకీయ నాయకునిగా రికార్డుకెక్కాడు. 2008లో శిక్షను కఠిన జీవిత ఖైదుగా తగ్గించారు.

Latest Videos

అయితే నేరం రుజువైన తర్వాత ఆనంద్ మోహన్ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయాడు. అయితే జైలులో ఉన్నప్పటికీ, అతను తన పరాక్రమాన్ని ప్రదర్శించి..2010 బీహార్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా, 2014 జనరల్ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా నిలవడంలో తన భార్య లవ్లీ ఆనంద్‌కు సహాయం చేశారు. ఆనంద్ మోహన్‌కి కొంతవరకు రాబిన్ హుడ్ ఇమేజ్ కూడా ఉంది.

నితీష్‌కి ఆనంద్ మోహన్ ఎందుకు అవసరం?
ఆనంద్ మోహన్ ఒక వ్యక్త. కాలేజ్ డ్రాప్ అవుట్. కానీ ఆయన జైలు నుంచి పుస్తకాలు రాశారు. ఆనంద్ మోహన్ తన కొడుకు నిశ్చితార్థ వేడుక కోసం పెరోల్‌పై బయటకు వచ్చినప్పుడు జైలు నుండి విడుదలైన వార్త అతనికి చేరింది. ఏప్రిల్ 24న జరిగిన ఆనంద్ మోహన్ కుమారుడి నిశ్చితార్థ వేడుకకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆయన డిప్యూటీ తేజస్వి యాదవ్, జేడీయూ చీఫ్ లాలన్ సింగ్ సహా పలువురు  రాజకీయ నేతలు, మంత్రులు హాజరయ్యారు.

నితీష్ కుమార్ ప్రభుత్వం ఏప్రిల్ 10న ప్రిజన్ మాన్యువల్- 2012ను సవరించి మోహన్ విడుదలను సులభతరం చేయడానికి నియమం 481కి మార్పులు చేసిన తర్వాత ఆనంద్ మోహన్ విడుదల జరిగింది. ప్రభుత్వ అధికారులను చంపినందుకు దోషులుగా ఉన్నవారు సత్ప్రవర్తన కారణంగా విడుదల చేయడానికి అర్హులు కాదని పేర్కొన్న ఈ నిబంధనను సవరించారు.

సుదీర్ఘ జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయవచ్చని ఆనంద్ మోహన్ మంగళవారం అన్నారు. తన విషయంలో కూడా అదే జరిగిందని నొక్కి చెప్పారు. ‘‘నన్ను విడుదల చేయాలనే నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్న వారు కోర్టును ఆశ్రయించవచ్చు. దానిని వ్యతిరేకించే వారు చట్టబద్ధమైన పాలనను అగౌరవపరుస్తున్నారు’’ అని చెప్పారు. 

ఆనంద్ మోహన్ విడుదలలో నితీశ్ యూ టర్న్
2021 మార్చిలో బీహార్ ప్రభుత్వం ఆనంద్ మోహన్ జైలు శిక్షను ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌ను తిరస్కరించింది. అప్పుడు నితీష్‌కి బీజేపీ మిత్రపక్షంగా ఉన్నారు. మరి ఇప్పుడు ఆనంద్ మోహన్‌కి సహాయం చేయాల్సిన అవసరం నితీష్‌కి ఎందుకు వచ్చింది? అనేది గమనిస్తే.. ఒకటి ఆనంద్ మోహన్ కుమారుడు, భార్య బీహార్‌లో నితీష్ సంకీర్ణ భాగస్వామి అయిన ఆర్జేడీ ఎమ్మెల్యేలు. 

అయితే అది ఒకటే కారణం కాదు.. బీహార్‌లో వరుస ఎన్నికల ఫలితాలు నితీశ్‌కు మద్దతు సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు చూపిస్తున్నాయి. బీజేపీతో అధికారం పంచుకున్నప్పుడు నితీశ్ హిందుత్వ ఓట్లతో లాభపడ్డారు. మతపరమైన గుర్తింపు గొడుగు కుల రాజకీయాలను తుంగలో తొక్కేందుకు ప్రయత్నించింది. అయితే రాజకీయ మనగడ కోసమే నితీశ్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ ఆనంద్ మోహన్ విడుదల కోసం సహకరించాల్సి  వచ్చింది. 

click me!