
Karnataka elections 2023: కర్ణాటకలోని మంగళూరులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిస్వా శర్మ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కర్ణాటక ప్రజలకు ఇస్తున్న హామీలపై విరుచుకుపడ్డారు. అయితే.. రాహుల్ హామీని ఎవరు తీసుకుంటారని హిమంత ఎద్దేవా చేశారు. ఈ నెల 10న కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న వేళ ఇవాళ హిమంత బిశ్వ శర్మ ఆ రాష్ట్రంలోని మంగళూరులో పర్యటించి బీజేపీ తరఫున ప్రచారం చేశారు. యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ గత 20 ఏళ్లుగా ఆమె కుమారుడు (రాహుల్ గాంధీ)ని రాజకీయాల్లో నిలబెట్టడానికి ఒంటరిగా పోరాడుతూనే ఉన్నారని చురకలు అంటించారు.
రాహుల్ గాంధీపై అస్సాం సీఎం విమర్శలు గుప్పించడం ఇది మొదటిసారి కాదు. అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీని "అసమర్థ" నాయకుడు అని పిలిచాడు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా భావించే అమేథీ నియోజకవర్గం నుంచి ఆయన(రాహుల్ గాంధీ) పూర్తిగా నిష్క్రమించారని విమర్శించారు. గతంలో అమేథీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అయితే.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న తర్వాత రాహుల్ గాంధీ ఈ ప్రాంతం నుండి యూ-టర్న్ తీసుకున్నాడనీ, గత 5 సంవత్సరాలుగా ఎప్పుడూ ఆ నియోజకవర్గానికి వెళ్లలేదని హిమంత బిస్వా శర్మ విమర్శించారు.
అదే సమయంలో అస్సాం సిఎం హిమంత బిస్వా శర్మ చేసిన ఈ ప్రకటనపై ఛత్తీస్‌గఢ్ సిఎం భూపేష్ బఘేల్ విరుచకపడ్డారు. సీఎం హిమంత బిశ్వ శర్మ పార్టీ మారారనీ, ఆయనలా అత్యాశపరులు ఎవరూ లేరని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు గుర్తింపు ఇచ్చిందనీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై ఆరోపణలు చేసే నైతికత ఆయనకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఇంకా మాట్లాడుతూ.. ప్రధాని మోడీ కర్ణాటక ప్రచారంలో బిజీగా ఉన్నారనీ, కానీ, ఈశాన్య ప్రాంతం కాలిపోతోందనీ,సైనికులు చనిపోతున్నారనీ, కానీ ప్రధాని ఈ ఘర్షణలపై ఏమీ మాట్లాడటం లేదని విమర్శించారు. అదే సమయంలో కర్ణాటక ప్రజలకు వారు ఏమి చేస్తారనే దానిపై చర్చ జరగడం లేదనీ, వారు కేవలం ప్రచారం, ఓట్లు మాత్రమే అడుగుతున్నారని విమర్శించారు. కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు మే 10న ఎన్నికలు జరుగనున్నాయి. మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.