
మణిపూర్‌లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ నేడు శాసన సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేసిన బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే సోరోఖైబామ్ రాజేన్ సింగ్ ఆ ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు బిస్వజిత్ సింగ్, వై ఖేమ్‌చంద్ సింగ్, గోవిందాస్ కొంతౌజం, ముఖ్య కార్యదర్శి రాజేష్ కుమార్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పి. డౌంగెల్ మరియు ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ప్రస్తుత మణిపూర్ అసెంబ్లీ గడువు మార్చి 19వ తేదీతో ముగియనుంది. కాగా ఎన్ బీరెన్ సింగ్ శుక్రవారం తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామ లేఖను గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు సమర్పించారు, కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని గవర్నర్ ఆయనను కోరారు. అయితే కొత్త ముఖ్యమంత్రిని ఎప్పుడు ఎన్నుకుంటారు ? లేదా బీజేపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వస్తుందనే విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.
ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్ బీరెన్ సింగ్ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారని, తదుపరి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారని ఆ పార్టీ అనధికారికంగా ప్రకటించింది. హీంగాంగ్ నియోజకవర్గం నుంచి ఎన్ బీరెన్ సింగ్ 18,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ సారి బీజేపీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసింది. మణిపూర్ అసెంబ్లీలో ఉన్న మొత్తం 60 స్థానాల్లో ఆ పార్టీ 32 స్థానాల్లో విజయం సాధించింది. అయితే బీజేపీ ఏర్పాటు చేసే ప్రభుత్వానికి జనతాదళ్ (యునైటెడ్), నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) మద్దతు ఇస్తామని తెలిపాయి. ఈ మేరకు ఆ పార్టీ అధికారికంగా శనివారం ప్రకటించింది. ఈ రెండు పార్టీలతో పాటు ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీ కు మద్దతు ప్రకటించారు.
మణిపూర్ రాష్ట్రంలో 31 స్థానాలు గెలుపొందిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. అయితే బీజేపీ 32 స్థానాలు సాధించింది. ఆ పార్టీ సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినా.. మిత్రపక్షాల మద్దతు తీసుకుంటోంది. కాగా 2017లో మణిపూర్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడంలో విఫలం అయ్యింది. ఆ ఎన్నికల సమయంలో 27 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందగా.. 2022 ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి ఆ పార్టీకి కేవలం 13 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. మిగిలిన వారంతా అధికార పార్టీలోకి జంప్ అయ్యారు.
గత ఎన్నికల నుంచే మణిపూర్ లో కాంగ్రెస్ బలహీనపడుతూ వస్తోంది. ఎక్కువ మంది కాంగ్రెస్ నాయకులు బీజేపీలోకి వెళ్లిపోవడంతో బలమైన నాయకులు లేకుండానే ఈ ఎన్నికల్లో ఆ పార్టీ రంగంలోకి దిగింది. అయితే కాంగ్రెస్ కు బలమైన నాయకుడు అయిన ఓక్రమ్ ఇబోబి సింగ్ గత రెండు నెలల్లో ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. అయితే గత ఐదేళ్లలో ఆయన ప్రతిపక్షహోదాలో గట్టిగా పోరాడలేదు. అందుకే ఈ సారి కేవలం ఆ పార్టీ 5 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో జేడీ (యూ) - 6, ఎన్ పీఎఫ్- 5 స్థానాల్లో గెలుపొందింది.