
పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో 'వారిస్ పంజాబ్ దే' సంస్థకు చెందిన కార్యకర్తను అరెస్టు చేయడంతో అజ్‌నాలా రణరంగంగా మారింది. ఏకంగా పోలీస్‌స్టేషన్ విధ్వంసానికి దారితీసింది. ఖలిస్థానీ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్‌పాల్ సింగ్ .. మద్దతుదారుడు లవ్‌ప్రీత్ తుఫాన్‌ను అరెస్టు చేశారు.
దీంతో అమృత్‌పాల్ సింగ్ తన అనుచరులతో కలిసి ఫిబ్రవరి 23న అమృత్‌సర్‌లోని అజ్నాలా పోలీస్ స్టేషన్ వెలుపల తీవ్ర దుమారాన్ని సృష్టించాడు. వందల మంది కార్యకర్తలు కర్రలు, తుపాకులు, కత్తులతో పోలీస్‌స్టేషన్‌పై దాడికి దూసుకొచ్చారు. సుమారు అరగంట పాటు పోలీసులకు, ప్రజలకు మధ్య వాగ్వాదం జరగడంతో పాటు పోలీసులను కూడా బెదిరించారు. ఫలితంగా చివరికి పోలీసులు వెనక్కి తగ్గి లవ్‌ప్రీత్‌ను విడుదలకు ఆదేశాలు జారీచేశారు.
ఈ క్రమంలో అమృత్‌పాల్ ఎవరు ? వేలాది మంది మద్దతుదారులు ఎలా వచ్చారు..? పంజాబ్‌లో అతడు ఒక్కసారిగా ఎలా ఎదిగాడు..? సోషల్ మీడియాలో కూడా రోజంతా ట్రెండింగ్‌లో ఉన్నాడు. అసలెవరీ అమృత్‌పాల్ సింగ్..? అనే ప్రశ్నలు తలెత్తాయి. అమృత్‌పాల్ సింగ్ తెలుసుకునే ముందు.. ముందుగా వారిస్ పంజాబ్ దే సంస్థ గురించి తెలుసుకోవాలి.
వారిస్ పంజాబ్ దే అంటే ఏమిటి?
పంజాబీ నటుడు, కార్యకర్త దీప్ సిద్ధూ సెప్టెంబర్ 2021లో 'వారిస్ పంజాబ్ దే' అనే సంస్థను స్థాపించారు. యువతను సిక్కు మతం మార్గంలోకి తీసుకురావడం, పంజాబ్‌ను 'మేల్కొలపడం'. ఈ సంస్థ యొక్క ఒక లక్ష్యంపై కూడా వివాదం ఉంది.పంజాబ్ స్వేచ్ఛ కోసం పోరాటం. 2021 జనవరి 26న ఎర్రకోటలో ఖల్సా పంత్ జెండాను ఎగురవేసినందుకు దీప్ సిద్ధూ వెలుగులోకి వచ్చారు. అయితే.. ఆయన 15 ఫిబ్రవరి 2022 న రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
దీప్ సిద్ధూ మృతితో ఆ సంస్థ అధినేత పదవి ఖాళీగా ఉంది. సెప్టెంబర్ 2022లో 'వారిస్ పంజాబ్ దే' అధినేతగా అమృతపాల్ సింగ్ ఎన్నికయ్యారు. ఈ క్రమంలో అమృతపాల్ సింగ్ తాను ఖలిస్తానీ ఉగ్రవాది జనరల్ సింగ్ భింద్రన్‌వాలే అనుచరుడినని చెప్పుకున్నాడు. అయితే ఖలిస్తాన్ పేరుతో సిక్కు యువకులను అమృతపాల్ సింగ్ తప్పుదోవ పట్టిస్తున్నాడని దీప్ సిద్ధూ కుటుంబం అభిప్రాయపడింది.
అమృత్‌పాల్ ఎవరు ?
అమృత్‌పాల్ సింగ్ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని జల్‌పూర్ ఖేడా గ్రామ నివాసి. 12వ తరగతి వరకు చదివాడు. అతను ఇంటర్నెట్ కారణంగా ఖలిస్తాన్, భింద్రన్‌వాలే దానికి సంబంధించిన సమస్త జ్ఞానాన్ని సంపాదించాడు. దుబాయ్‌లో ఉంటూ ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం చేస్తున్నాడు. గతేడాది సెప్టెంబర్‌లో దుబాయ్‌లో పని ముగించుకుని పంజాబ్‌కు వచ్చాడు. అయితే.. ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ వ్యవస్థాపకుడు, యాక్టర్ దీప్‌సిద్ధూ మరణంతో అమృత్‌పాల్ జీవితమే మారిపోయింది. సిద్ధూ అనుచరులకు మార్గదర్శకాలు చేసేవారు కరవైపోయారు.
ఈ పరిమాణాన్ని అమృత్‌పాల్ చాలా చకచక్యంగా వాడుకొన్నాడు. ‘వారిస్ పంజాబ్ దే’కు తానే నాయకుడినని ప్రకటించుకొన్నాడు. తొలి రోజుల్లో సిద్ధూ కుటుంబీకులు ఇందుకు అంగీకరించలేదు. సాధారణంగా గురుపత్వంత్ పన్నూ వంటి ఖలిస్థానీ మద్దతుదారులు విదేశాల్లో ఇక్కడా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కానీ, అమృత్‌పాల్ ఖలిస్థానీ కార్యకలాపాలకు ఏకంగా పంజాబ్‌నే స్థావరంగా ఎంచుకొన్నాడు.
ఇది ఖలిస్థానీ సానుభూతిపరులను ఆకర్షించింది. ఈ చర్యతో అమృత్‌పాల్ కు ఎక్కడ లేని పాల్ పాపులర్టీ వచ్చింది. సంస్థ అధినేతగా పట్టాభిషిక్తుడైన సందర్భంగా అమృతపాల్ సింగ్ మాట్లాడుతూ.. 'భింద్రన్‌వాలే నాకు స్ఫూర్తి. ఆయన చూపిన బాటలోనే నడుస్తాను. నేను అతనిలా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి సిక్కు కోరుకునేది అదే కానీ నేను అతనిని అనుకరించడం లేదు. నేను అతని పాద ధూళికి కూడా సమానం కాదు.'అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ, 'నాకు మత స్వేచ్ఛ కావాలి. నా ప్రతి రక్తపు బొట్టు దీనికే అంకితం. గతంలో ఈ ఊరి నుంచే మా యుద్ధం మొదలైంది. భవిష్యత్ యుద్ధం కూడా ఈ గ్రామం నుంచే మొదలవుతుంది. మేమంతా ఇంకా బానిసలం. మన స్వేచ్ఛ కోసం మనం పోరాడాలి. మన నీటిని దోచుకుంటున్నారు. మా గురువును అవమానిస్తున్నారు. పంజాబ్‌లోని ప్రతి యువకుడు ఆరాధన కోసం తన ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉండాలని మతవిద్వేషాలను రెచ్చగొట్టడం మొదలుపెట్టాడు.
ఇదిలాఉంటే.. అమృత్‌పాల్ కారణంగా మతానికి చెడ్డపేరు వస్తోందని.. పాక్ ఐఎస్‌ఐ అజెండాను ఆయన అనుసరిస్తున్నాడని పలువురు సిక్కు మేధావులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పలువురు సిక్కు గురువులు, నాయకులు అమృత్‌పాల్‌ను విమర్శించారు. అతడి కార్యకలాపాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.