ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. కేజ్రీవాల్, కల్వకుంట్ల కవితల అరెస్ట్ తో మరోసారి ఈ అంశంపై చర్చ సాగుతుంది.
న్యూఢిల్లీ:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుతో ఢిల్లీ లిక్కర్ స్కాం అంశం మరోసారి తెరమీదికి వచ్చింది. ఈ ఇద్దరిని ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. న్యూఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ ప్రభుత్వంతీసుకువచ్చిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై ఆరోపణలు రావడంతో ఈ పాలసీని అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ రద్దు చేసింది. అయితే ఈ పాలసీపై సీబీఐ విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. దరిమిలా ఈ పాలసీపై సీబీఐ విచారణ చేస్తుంది. సీబీఐ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ కూడ రంగంలోకి దిగింది.
న్యూఢిల్లీలో ఉన్న మద్యం దుకాణాలను ప్రైవేట్ వారికి అప్పగించాలని ఆప్ ప్రభుత్వం 2020లో నిర్ణయం తీసుకుంది.అయితే అంతకుముందు మాత్రం 60 శాతం మద్యం దుకాణాలు ప్రభుత్వం ఆధీనంలో ఉండేవి. మిగిలిన 40 దుకాణాలు ప్రైవేట్ ఆధ్వర్యంలో నడిచేవి.
రాష్ట్రంలోని మద్యం దుకాణాలను ప్రైవేట్ వారికి కేటాయించే విషయమై అధ్యయనం చేసేందుకు మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది కేజ్రీవాల్ సర్కార్. ఈ కమిటీ సూచనలను కేజ్రీవాల్ సర్కార్ ఆమోదించింది. ఈ సూచనల ఆధారంగా ఢిల్లీ లిక్కర్ పాలసీని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. 2021 మే 21న ఢిల్లీ లిక్కర్ పాలసీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
అయితే ఈ పాలసీతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం వచ్చే అవకాశం ఉందని విమర్శలు వచ్చాయి. ఈ పాలసీకి లెఫ్టినెంట్ గవర్నర్ 2021 నవంబర్ మాసంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అయితే మద్యం దుకాణాల లైసెన్సుల కోసం భారీగా ఫీజులను పెంచారు. గతంలో ఉన్న తరహాలో కాకుండా ఫీజులు పెంచడంపై ఆరోపణలు వచ్చాయి. గతంలో ఎల్-1 లైసెన్స్ కోసం రూ. 25 లక్షలు చెల్లిస్తే సరిపోయేది. అయితే కొత్త పాలసీ ప్రకారంగా దీన్ని రూ. 5 కోట్లకు పెంచారు. దరిమిలా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు మాత్రమే ఎల్-1 లైసెన్స్ కోసం పోటీ పడే పరిస్థితి నెలకొంది.
మరో వైపు ఈ పాలసీలో అనేక లోసుగులున్నాయనే ఆరోపణలు కూడ వచ్చాయి. ఈ పాలసీ ద్వారా ఆప్ నేతలు మద్యం వ్యాపారుల నుండి లబ్ది పొందారని విపక్షాలు ఆరోపించాయి. ప్రైవేట్ సంస్థలకు హోల్ సేల్ మద్యం వ్యాపారాలను ఇవ్వడం కోసం నిబంధనలను ఉల్లంఘించినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై దర్యాప్తు సంస్థలు దేశ వ్యాప్తంగా సోదాలు నిర్వహించాయి. పలువురిని అరెస్ట్ చేశారు.అయితే ఈ పాలసీపై ఆరోపణలు రావడంతో ఈ పాలసీని కేజ్రీవాల్ సర్కార్ వెనక్కి తీసుకుంది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.8,800కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అప్పట్లో ఆప్ సర్కార్ అంచనా వేసింది. మద్యం విక్రయాల ద్వారా గతంలో కంటే 27 శాతం ఆదాయం పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది.
కొత్త పాలసీ ప్రకారంగా మద్యం హోం డెలీవరీతో పాటు మద్యం దుకాణాల పనివేళల విషయంలో కూడ దుకాణాలు నిర్వహించే వారిదే నిర్ణయాధికారం. మరో వైపు మద్యం ధరల విషయంలో కూడ ప్రైవేట్ వ్యక్తులకే స్వేచ్ఛ ఎక్కువ ఉందనే విమర్శలు కూడ లేకపోలేదు.
2022 ఏప్రిల్ లో ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నరేష్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగినట్టుగా నరేష్ కుమార్ గుర్తించారు.అంతేకాదు కొత్త పాలసీ ప్రకారంగా రాష్ట్ర ఖజానాకు రూ. 580 కోట్ల మేరకు నష్టం జరిగిందని అధికారులు గుర్తించారు.ఈ విషయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కు నివేదించారు.
ఈ విషయమై లెఫ్టినెంట్ గవర్నర్ కు లేఖ రాశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర హోంశాఖకు ఈ విషయమై నివేదించారు. దరిమిలా సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 2022 జూలై 22న ఢిల్లీ లిక్కర్ స్కాంపై సీబీఐ విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు సీబీఐ రంగంలోకి దిగింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ లాబీ కీలకంగా వ్యవహరించిందని ఈడీ ఆరోపించింది. ఈ క్రమంలోనే పలువురు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిని దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.