
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలైన తర్వాత ప్రపంచ దేశాలన్నీ క్రమంగా కరోనాపై చర్చ వదిలి ఈ యుద్ధంపై వాదోపవాదలు చేసుకోవడం మొదలయ్యాయి. చాలా దేశాలు రష్యా ‘సైనిక చర్య’ను దురాక్రమణగా వర్ణిస్తూ మండిపడ్డాయి. కాగా, కొన్ని దేశాలు మాత్రం పరోక్షంగా రష్యాకు మద్దతు ఇచ్చాయి. మరికొన్ని దేశాలు తటస్థ వైఖరి అనుసరించాయి. నాటో, ఐరాస మొదలు చాలా అంతర్జాతీయ వేదికలపై ఈ యుద్ధంపై చర్చ జరిగింది. రష్యాకు ముకుతాడు వేయడానికి అమెరికా, యూరప్ దేశాలు ఆర్థిక ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించాయి. అయినా వెనకడుగు వేయడానికి ససేమిరా అంటున్న రష్యా దాని మిత్ర దేశాలు, తటస్థ దేశాలకు కీలకమైన చమురు, ఇతర సరుకులను చాలా తక్కువ ధరలకు ఎగుమతి చేస్తామని ఊరిస్తూ ఆంక్షల ప్రభావం బలంగా తాకకుండా చర్యలకు సిద్ధమైంది. ఈ ఆఫర్‌పై భారత్ సానుకూలంగా ఆలోచిస్తున్నట్టు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత్‌పై ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్త చర్చ మొదలైంది.
ఒక వైపు అమెరికా డిప్యూటీ ఎన్ఎస్ఏ.. మరో వైపు రష్యా విదేశాంగ మంత్రి వరుసగా భారత పర్యటనలు చేయడం సంచలనంగా మారింది. భారత్ ఎక్కడ తమ చేతి దాటి పోతుందోననే భయం అమెరికా.. ఎలాగైనా సరే అత్యధిక చమురు అవసరాలు ఉండే భారత్‌ను తమ ఆఫర్‌తో మెప్పించుకోవాలని రష్యా తెగ ఆరాటపడుతున్నాయి.
చైనాకు చెక్ పెట్టాలంటే అమెరికాకు భారత్ అత్యవసరం. క్వాడ్ సమ్మిట్‌లోనూ భారత్‌కు అమెరికా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. అందుకే భారత్‌పై అమెరికా కరాఖండిగా తేల్చుకోలేకపోతున్నది. వదులుకోలేదు.. అలాగని బెదిరించనూ లేదు.. వైరి వర్గంలోనూ కలుపలేదు. అమెరికా అవసరం అలాంటిది. కానీ, పోతూ పోతూ.. అమెరికా డిప్యూటీ ఎన్ఎస్ఏ ఓ సున్నితమైన హెచ్చరిక చేసి పోయారు. రష్యాపై విధించిన అమెరికా ఆంక్షలను నీరుగార్చే పనులు చేయొద్దని, రష్యా నుంచి అదనంగా చమురు దిగుమతి చేసుకోరాదని కోరారు. లేదంటే తర్వాతి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. చైనా మళ్లీ దుస్సాహసాలకు ప్రయత్నించకపోదని, భారత సరిహద్దుపై కవ్వింపులకు దిగితే మాత్రం భారత్‌కు రష్యా సహకరించడానికి ముందుకు రాదని, ఎందుకంటే.. చైనా, రష్యాల మధ్య సంబంధం అపరిమితమైనదని ఇరు దేశాలు బహిరంగంగా ప్రకటించుకున్నాయని వివరించారు.
కానీ, ఈ హెచ్చరికను భారత విదేశాంగ శాఖ ఎస్ జైశంకర్ తిప్పికొట్టారు. అసలు రష్యా నుంచి ఎక్కువగా చమురు దిగుమతి చేసుకునేవి ఐరోపా దేశాలేనని కొట్టిపారేశారు.
అమెరికా డిప్యూటీ ఎన్ఎస్ఏ బయట అడుగుపెట్టగానే నిన్న సాయంత్రం రష్యా విదేశాంగ మంత్రి న్యూఢిల్లీ చేరారు. మనవిదేశాంగ మంత్రితో సమావేశమై భారత్ తీరుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్తతలపై భారత్ వైఖరి అభినందనీయం అని కొనియాడారు. అదే తరుణంలో భారత్ తమ నుంచి ఏది కొనుగోలు చేయాలనుకున్నా అది సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని, దానిపై చర్చించడానికి రెడీ అని ప్రకటించారు. వాణిజ్యం కోసం అమెరికన్ డాలర్ బేస్ పక్కనపెట్టి రూపీ, రూబుల్ మెకానిజం ఏర్పాటుకూ సిద్ధంగా ఉన్నామని వివరించారు.
ఇదే సందర్భంలో ఆయన ప్రధాని మోడీకి తాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుంచి తెచ్చిన సందేశాన్ని పర్సనల్‌గా అందించాలని భావిస్తున్నట్టు అన్నారు. అందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇలా ‘పర్సనల్ మీట్’ ఈ తరుణంలో కోరడం వెనుక ఆంతర్యం ఇంకేమైనా ఉన్నదా? అనే చర్చ మొదలైంది.
ఇప్పటికే రష్యాకు భారత్ పరోక్ష మద్దతు ఇచ్చినట్టేనని, ఆ దేశం నుంచి చమురు కొనుగోలుకు కూడా భారత్ దాదాపు రంగం సిద్ధం చేసుకుంటున్నదని పశ్చిమ మీడియా కోడై కూస్తున్నది. ఈ సందర్భంలో పర్సనల్ భేటీలు చేస్తే.. ఇంకేముందీ భారత్‌ను రష్యా లాక్ చేసినట్టే అవుతుందన్నది నిపుణుల వాదన. రష్యా అధ్యక్షుడు పుతిన్.. భారత ప్రధాని మోడీ యోగక్షేమాల గురించిన సందేశాన్ని వ్యక్తిగతంగా అందిస్తానని చెప్పినా.. ప్రస్తుత తరుణంలో దాని వెనుక ఉన్న కారణాల అన్వేషణపైనే ఫోకస్ ఉంటుంది. అసలు ఆ భేటీలో ఊహాగానాలు వస్తున్నట్టు ఏ డీల్ ప్రతిపాదనలు లేకున్నా.. ఒప్పందాలు కుదరకపోయినా.. పశ్చిమ దేశాల దృష్టి మాత్రం మారే అవకాశాలు ఉన్నాయి. భారత్ మరో అడుగు రష్యా చెంతకు చేరిందనే వాదనలు మరింత బలపడతాయి. ఈ వాతావరణం రష్యాకు మరింత కలిసి రానుంది. ఎందుకంటే అలాంటి సందర్భాల్లో భారత్ కూడా రష్యా వైపే మొగ్గు చూపి వాణిజ్యానికి సిద్ధం కావొచ్చనే అభిప్రాయాలు వస్తున్నాయి. అయితే, ఈ వ్యవహారంపై భారత్ ఎలా స్పందించనుందనేది చూడాల్సి ఉన్నది.