
లోకోమోటివ్ పరికరాలలో (locomotive equipment) లోపమే వెస్ట్ బెంగాల్ (west bengal) లో రైలు ప్రమాదానికి (train accident) కారణమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (railway minister ashwini vaishnav) అన్నారు. ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే జోన్‌లోని బికనీర్-గౌహతి ఎక్స్‌ప్రెస్ ((Bikaner-Guwahati Express) పట్టాలు తప్పిన ప్రదేశాన్ని రైల్వే మంత్రి శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈ ఘటనపై చట్టబద్ధమైన విచారణ ప్రారంభమైందని అన్నారు. ప్రమాద సహాయక కార్యక్రమాలను ప్రధాని మోడీ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. తాను ప్రధానమంత్రితో వివరాలు ఎప్పటికప్పుడు పంచుకుంటున్నానని చెప్పారు. ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. తమ ప్రాథమిక విచారణలో లోకోమోటివ్ పరికరాలలో లోపం ఉందని గుర్తించామని చెప్పారు. అయితే ప్రమాదానికి గల అసలైన కారణాన్ని తెలుసుకోవడానికి రైల్ సేఫ్టీ కమిషన్ (railway sefty commission) విచారణ నిర్వహిస్తోందని మంత్రి అన్నారు.
‘‘ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. ప్రస్తుతం మేము రెస్క్యూ, సహాయక కార్యకలాపాలపై దృష్టి సారించాము. ఇప్పటికే ఓ బృందం గ్యాస్ కట్టర్‌లతో ఘటనా స్థలానికి చేరుకుంది. సీనియర్ అధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారు. నేను వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంటాను" అని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అంతకు ముందు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లాలో గురువారం సాయంత్రం బికనీర్-గౌహతి ఎక్స్‌ప్రెస్ (15633) 12 కోచ్‌లు పట్టాలు తప్పి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పొయిన ఘటన తెలిసిందే. అయితే ముందుగా ఆరుగురు చనిపోయారని తెలిపిన రైల్వే శాఖ తరువాత దీనిని సవరించింది. ఈ ఘటనలో మృతులకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్పగాయాలైన వారికి రూ.25,000 ఎక్స్‌గ్రేషియాను భారతీయ రైల్వే ప్రకటించింది.
ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్ బృందాలు చేరుకొనిసహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయి. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, అగ్నిమాపక సిబ్బంది కూడా సహాయక చర్యలకు సహకరిస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదం విషయంలో అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో మాట్లాడారు. రైల్వే మంత్రిత్వ శాఖతో ఆయన ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
ఈ ఘటనపై కేంద్ర రైల్వే, జౌళి శాఖ సహాయ మంత్రి దర్శన జర్దోష్ (dharshan josh)విచారం వ్యక్తం చేశారు. ‘‘ వెస్ట్ బెంగాల్ లోని జల్‌పైగురి జిల్లా దోమోహని, మేనాగురి సమీపంలో బికనీర్-గౌహతి ఎక్స్‌ప్రెస్ దురదృష్టకర ప్రమాదానికి గురైంది. ప్రయాణీకులు, సిబ్బంది అందరి భద్రత కోసం ప్రార్థిస్తున్నా. నిరంతరం రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నా. ప్రయాణీకులను వేగంగా తరలిస్తానని హామీ ఇస్తున్నాను’’ అని మంత్రి ట్వీట్ చేశారు. వెస్ట్ బెంగాల్ లో జరిగిన రైలు ప్రమాదంలో సుమారు 10 కోచ్‌లు దెబ్బతిన్నాయని గౌహతిలోని నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే చీఫ్ పీఆర్ వో గునీత్ కౌర్ ప్రకటించారు. మృతులకు రూ. 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 1 లక్ష, స్వల్ప గాయాలకు రూ. 25,000 ఇస్తామని చెప్పారు. ఉన్నత స్థాయి విచారణ జరుగుతోందని ఆయన తెలిపారు.