
పంజాబ్ లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఆమ్ ఆద్మీ పార్టీ కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడబోదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్ పాల్ సింగ్, అతడి అనుచరులపై పంజాబ్ పోలీసులు అణచివేత ప్రారంభించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ హాస్పిటల్‌లో హోమం నిర్వహణ.. ఫొటో వైరల్.. ఆ హాస్పిటల్ ఏమన్నదంటే?
‘‘గత కొన్ని రోజులుగా పంజాబ్ లో వాతావరణాన్ని చెడగొట్టేందుకు కొందరు ప్రయత్నించడం చూశాం. ఏ పరిస్థితుల్లోనూ పంజాబ్ వాతావరణాన్ని దెబ్బతీయనివ్వం. శాంతిభద్రతలను కాపాడాలి’’ అని ఆమ్ ఆద్మీ జాతీయ కన్వీనర్ అన్నారు. పంజాబ్ లోని జలంధర్ లోని డేరా సచ్ ఖండ్ బల్లాన్ లో శ్రీ గురు రవిదాస్ బని అధియాన్ సెంటర్ కు శంకుస్థాపన చేసిన సందర్భంగా కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు.
పంజాబ్ వాతావరణాన్ని దెబ్బతీసే సంఘ విద్రోహ శక్తులను మన్ ప్రభుత్వం అనుమతించబోదని కేజ్రీవాల్ అన్నారు. కాగా... అమృత్ పాల్ గత ఎనిమిది రోజులుగా పరారీలో ఉండటం గమనార్హం. అతడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులను తప్పించుకొని తిరుగుతున్నట్టు పలు వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. కాగా.. వారిస్ పంజాబ్ దే చీఫ్, అతడి సహచరులపై రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన జాతీయ భద్రతా చట్టాన్ని విధించింది.
అయితే అమృత్ పాల్ ను పరారీలో ఉన్నట్లు పోలీసులు అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న అతడి పలువురి అనుచరులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. రాడికల్ నాయకుడిని పట్టుకునేందుకు మార్చి 18న పంజాబ్ పోలీసులు ఆపరేషన్ ప్రారంభించారు. వారిస్ పంజాబ్ దే చీఫ్ ను ఆప్ ప్రభుత్వం అదుపులోకి తీసుకోలేకపోయిందని కాంగ్రెస్ విమర్శించింది. ఈ విషయంలో అంతకు ముందు మార్చి 20వ తేదీన పంజాబ్, హర్యానా హైకోర్టు కూడా పంజాబ్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘మీకు 80,000 మంది పోలీసులు ఉన్నారు ? అమృతపాల్ సింగ్ ఎలా తప్పించుకున్నాడు?’’ అని పేర్కొంది. ఇది పోలీసుల ఇంటెలిజెన్స్ వైఫల్యమని వ్యాఖ్యలు చేసింది.