బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో దేశ విభజ‌న‌ను అనుమతించబోం: రాహుల్‌ గాంధీ

By Mahesh RajamoniFirst Published Sep 20, 2022, 10:31 AM IST
Highlights

Rahul Gandhi: విద్వేషం, విభజన, కోపంతో కూడిన విధానాలను అనుసరిస్తే దేశం అభివృద్ధి చెందడం అసాధ్యమని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని మోడీ తన స్నేహితులను మరింత ధనవంతులుగా చేస్తున్నారని ఆరోపించారు. 
 

Bharat Jodo Yatra: బీజేపీ ద్వేషం, హింసను వ్యాపింపజేస్తోందనీ, ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో దేశాన్ని విభజించేందుకు అనుమతించబోమని కాంగ్రెస్ నాయ‌కులు రాహుల్‌ గాంధీ అన్నారు. విద్వేషం, విభజన, కోపంతో కూడిన విధానాలను అనుసరిస్తే దేశం అభివృద్ధి చెందడం అసాధ్యమని పేర్కొన్నారు. ప్రధాని మోడీ తన స్నేహితులను మరింత ధనవంతులుగా చేస్తున్నారని ఆరోపించారు. కేర‌ళ‌లోని అలప్పుజా లో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర సోమ‌వారం సమీపంలోని చేర్తాల చేరుకుంది. ఈ క్ర‌మంలోనే అక్క‌డ ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆయ‌న పై వ్యాఖ్య‌లు చేశారు. 

భార‌త్ జోడో యాత్ర సంద‌ర్భంగా చేర్తాల‌లో ఏర్పాటు చేసిన స‌మావేశానికి పెద్దఎత్తున తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ద్వేషం, కోపం, విభ‌జ‌న‌తో కూడిన విధానాలను అనుసరిస్తే దేశం అభివృద్ధి చెందడం అసాధ్యమని అన్నారు. తన 150 రోజుల సుదీర్ఘ యాత్రకు కేరళలో భారీ సంఖ్యలో హాజరైనందుకు కృతజ్ఞతలు తెలిపిన ఆయ‌న‌.. దేశ భవిష్యత్తు ప్రమాదంలో ఉందని అర్థం చేసుకున్న ప్రజలు తన పాదయాత్రలో చేరుతున్నారని అన్నారు. “విభజింపబడిన దేశం నిరుద్యోగం వంటి సమస్యలను పరిష్కరించగలదని మీరు అనుకుంటున్నారా? విభజించబడిన సమాజం ఆసుపత్రులు, రోడ్లు నిర్మించగలదనీ, మన పిల్లలను చదివించగలదని మీరు అనుకుంటున్నారా? మనం ద్వేషపూరిత మార్గాన్ని అనుసరిస్తే భారతదేశం అటువంటి సమస్యలను పరిష్కరించడం అసాధ్యం” అని రాహుల్ గాంధీ అన్నారు. ఈ దేశం ఎవరి భుజాలపై నడుస్తుందో, విద్వేషానికి మూల్యం చెల్లించేది సామాన్యులేనని ఆయన అన్నారు.

“ప్రపంచంలో అత్యంత ధనవంతులు మన వద్ద ఉన్నప్పటికీ మన ప్రజలు నిత్యావసర వస్తువులకు అత్యధిక ధరను ఎలా చెల్లిస్తారు? ఇది మనం అంగీకరించగలిగే విషయమా? ఈ దేశాన్ని విభజించడానికి ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ భావజాలాన్ని మేము అనుమతించము. లక్షలాది మంది భారతీయులు నిరుద్యోగులుగా ఉన్న భారతదేశాన్ని మేము అంగీకరించము. నిత్యావసర వస్తువుల కోసం లక్షలాది మంది ప్రజలు అధిక ధరలతో కొట్టుమిట్టాడుతున్న భారతదేశాన్ని మేము అంగీకరించము” అని ఆయన అన్నారు. ద్వేషం, కోపం లేదా హింసను రాష్ట్రం నమ్మదని పేర్కొన్న రాహుల్ గాంధీ.. గత కొన్ని రోజుల్లో ఆత్మవిశ్వాసంతో కూడిన కేరళను చూశానని అన్నారు.

“ఈ రోజు భారతదేశం కోపం, హింస, ద్వేషంతో నిండిపోయింది. బీజేపీ ఈ విద్వేషాన్ని, హింసను వ్యాపింపజేస్తుంది. ఇది వారి డిఎన్‌ఎలో ఉంది. ఫలితంగా కొంతమంది వ్యక్తులు బిలియన్ల లాభాలను ఆర్జిస్తున్నారు”అని తెలిపారు. ఈ యాత్రకు కాంగ్రెస్ కార్యకర్తలే కాకుండా సామాన్యులు, కొంతమంది వామపక్ష కార్యకర్తల మద్దతు ఉందని చెప్పారు. "ఎందుకంటే ఈ దేశం ప్రమాదంలో ఉందని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నారు. మీరు ఒక వ్యక్తికి మద్దతు ఇవ్వడం లేదు. వ్యక్తులు ముఖ్యం కాదు. వ్యక్తులు వస్తారు.. పోతారు..  మీరు ఒక ఆలోచనకు మద్దతు ఇస్తున్నారు.. మీరు మన దేశ సంస్కృతి, చరిత్ర-సాంప్రదాయానికి మద్దతు ఇస్తున్నారు" అని ఆయన అన్నారు. శ్రీనారాయణ గురు లేదా చట్టంబి స్వామికల్ లేదా మహాత్మా అయ్యంకాళి వంటి సంఘ సంస్కర్తలు ఈరోజు జీవించి ఉంటే 'భారత్ జోడో' అంటారని రాహుల్ గాంధీ అన్నారు.

కేరళీయులు తమ ప్రేమ సామర్థ్యాన్ని కోల్పోవద్దని ఆయన కోరారు. "ఇది ఈ రాష్ట్ర ప్రజలను నిర్వచిస్తుంది.. అదే మిమ్మల్ని విజయవంతమైన రాష్ట్రంగా చేస్తుంది.  మీరు నాకు అందించిన ప్రేమ-ఆప్యాయతలకు నేను మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను" అని అన్నారు. 

click me!