అసోంలో బాల్య వివాహాలపై క‌ఠిన చర్యలు కొనసాగిస్తాం: సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ‌

By Mahesh RajamoniFirst Published Feb 5, 2023, 12:08 PM IST
Highlights

Dispur: అసోంలో బాల్య వివాహాలపై క‌ఠిన చర్యలు కొనసాగిస్తామ‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి హిమంత బిశ్వ శ‌ర్మ మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. ఇప్పటివరకు అసోం వ్యాప్తంగా బాల్య వివాహాలకు సంబంధించి 4074 కేసులు నమోదు కాగా, 8134 మందిని పోలీసులు నిందితులుగా గుర్తించారు.
 

Assam-child marriages: రాబోయే రోజుల్లోనూ బాల్య వివాహాలపై అణచివేత కొనసాగుతుందని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. బాల్య వివాహాల‌తో సంబంధమున్న వారిపై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వని హెచ్చ‌రించారు. రాష్ట్రంలో శనివారం ఉదయం వరకు బాల్య వివాహాలకు సంబంధించి 2211 మందిని అరెస్టు చేసినట్లు ఆయ‌న మీడియాతో అన్నారు. ఇప్పటివరకు అసోం వ్యాప్తంగా బాల్య వివాహాలకు సంబంధించి 4074 కేసులు నమోదు కాగా, 8134 మందిని నిందితులుగా గుర్తించారు.

కాగా, రాష్ట్రంలో బాల్యవివాహాల కేసుల్లో ప్రమేయం ఉన్న 2,170 మందిని అరెస్టు చేసినట్లు అసోం పోలీసు అధికార ప్రతినిధి ప్రశాంత్ కుమార్ భుయాన్ తెలిపారు. "బాల్య వివాహాల కేసుల్లో అరెస్టుల సంఖ్య పెరిగింది. ఈ ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,170 మందిని పోలీసులు అరెస్టు చేశారని, ఇది మరింత పెరుగుతుందని"  చెప్పారు. రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో బాల్య వివాహాలకు సంబంధించి 4,074 కేసులు నమోదయ్యాయని అసోం పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) జీపీ  సింగ్ శుక్రవారం మీడియా సమావేశంలో చెప్పారు. అరెస్టయిన వారిలో 52 మంది మతగురువులు, బాల్యవివాహాలకు పాల్పడిన ఖాజీలు ఉన్నారని తెలిపారు.

ధుబ్రీ, బార్పేట, కోక్రాఝార్, విశ్వనాథ్ జిల్లాల్లో అత్యధిక మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అసోంలో బాల్యవివాహాలు పెద్ద సంఖ్య‌లో జరుగుతున్నాయని తనకు సమాచారం అందడంతో విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పోలీసులను ఆదేశించినట్లు డీజీపీ సింగ్ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బాల్యవివాహాలు సెద్ద సంఖ్య‌లో జరుగుతున్నాయని తనకు సమాచారం అందిందని, దీనిపై విచారణ చేపట్టాలని రెండు నెలల క్రితం సీఎం శర్మ పోలీసులను ఆదేశించార‌న్నారు. సీఎం ఆదేశాల మేరకు అన్ని జిల్లాల ఎస్పీలు ఆయా గ్రామ రక్షణ పార్టీలు, గావ్ బురాలు, వివిధ వర్గాల అధిపతులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులతో సంప్రదింపులు జరపాలని చెప్పామనీ, దాని ఆధారంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బాల్యవివాహాలు జరుగుతున్నట్లు గుర్తించామని తెలిపారు. సేకరించిన డేటా 2020, 2021, 2022 సంవత్సరాల‌కు చెందినదని డీజీపీ సింగ్ పేర్కొన్నారు. పోక్సో చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద చాలా కేసులు నమోదు చేశామనీ, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు. అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.

ఇదిలావుంగా, బాల్య వివాహాల నిషేధ చట్టంలోని నిబంధనల ప్రకారం బాల్య వివాహాలపై అవసరమైన నిబంధనలను రూపొందించకుండా అసోం ప్ర‌భుత్వం చర్యలు తీసుకుంటోందని ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) శనివారం ఆరోపించింది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం బాలల హక్కులను పరిరక్షించే సంస్థలపై చర్య తీసుకోవడంలో వైఫల్యాన్ని కూడా కాంగ్రెస్ ప్రశ్నించింది. శుక్రవారం నుంచి బాల్య వివాహాలపై చర్యలు తీసుకుంటున్న పోలీసులు, అలాంటి కేసులపై నమోదైన 4,074 ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఇప్పటివరకు 2,258 మందిని అరెస్టు చేశారు. ఈ ప్రచారం 2026 అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగుతుందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శనివారం చెప్పారు.

ఏఐయూడీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఏమ‌న్నారంటే..? 

ఏఐయూడీఎఫ్ ప్రధాన కార్యదర్శి అమీనుల్ ఇస్లాం మాట్లాడుతూ పీసీఎంఏ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు రూపొందించలేదని పేర్కొన్నారు. "2006 నాటి పీసీఎంఏ 2007 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది కేంద్ర చట్టం కాబట్టి రాష్ట్రాలు నిబంధనలు రూపొందించాల్సి ఉంటుంది. 2007 నుంచి 2014 వరకు రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో, అప్పటి నుంచి బీజేపీ పాలనలో ఉంది. ప్రభుత్వం ఎందుకు నిబంధనలు రూపొందించలేదని" ప్రశ్నించారు.

click me!