Punjab Elections 2022: అంతర్గత కలహాలు ఎక్కడున్నాయ్?: సిద్దూ యూటర్న్.. కాంగ్రెస్‌లో కలహాలు ముగిసినట్టేనా?

Published : Feb 12, 2022, 05:56 PM IST
Punjab Elections 2022: అంతర్గత కలహాలు ఎక్కడున్నాయ్?: సిద్దూ యూటర్న్.. కాంగ్రెస్‌లో కలహాలు ముగిసినట్టేనా?

సారాంశం

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం ఫేస్‌గా ఎంపిక కాకపోవడంపై పీపీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్దూలో అసంతృప్తి ఉన్నట్టు చాలా మంది భావించారు. కానీ, తాజాగా, ఆయన అధిష్టానం నిర్ణయంతో తమకే ఇబ్బంది లేదని, రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని పార్టీలోని అందరూ స్వాగతించారని సిద్దూ వివరించారు. దీంతో పంజాబ్ కాంగ్రెస్‌లో ఇక కలహాలు ముగిసినట్టేనా? అనే అంశంపై వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.  

చండీగడ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల(Punjab Assembly Elections)కు ముందే కాంగ్రెస్‌(Congress)లో అంతర్గత కలహాలు కొలిక్కి వచ్చేలా ఉన్నాయి. మరో వారం రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్దూ(Navjot singh sidhu) కీలక వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందటి వాదనలతో ఆయన స్వయంగా విబేధించారు. యూటర్న్ తీసుకుని.. పార్టీలో అంతర్గత కలహాలు ఎక్కడ ఉన్నాయ్ అని ఎదురు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం గురించి మాట్లాడుతూ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో ఎవరికీ ఎలాంటి బాధ లేదని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి నవజోత్ సింగ్ సిద్దూ మాట్లాడుతూ, కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఎక్కడ ఉన్నాయి? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఒక నిర్ణయం తీసుకుని తమకు చెప్పారని, తాము అందరం ఆ నిర్ణయాన్ని స్వాగతించామని వివరించారు. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో తమకు ఎవరికీ ఏ బాధ లేదని తెలిపారు.

కొంత కాలంగా నవజోత్ సింగ్ సిద్దూ అసంతృప్తిగా ఉన్నారు. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌తోనూ ఆయనకు పొసగలేదు. వారి మధ్య గొడవలతోనే ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఆ తర్వాత సీఎంగా నవజోత్ సింగ్ సిద్దూనే ఎంపిక అవుతారని చాలా మంది భావించారు. కానీ, అనూహ్యంగా పార్టీ అధిష్టానం దళిత్ ఫేస్ చరణ్ జిత్ సింగ్ చన్నీని తదుపరి సీఎంగా ఎంచుకుంది. ఆ తర్వాత పలుమార్లు ఆయన సీఎం చన్నీపై అసహనాన్ని వ్యక్తపరిచిన ఘటనలు ఎదురయ్యాయి. కొన్నిసార్లు అయితే.. బహిరంగంగానే సీఎం చన్నీపై అక్కసు వెళ్లగక్కారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై చన్నీ, నవజోత్ సింగ్ సిద్దూ బరిలో ఉన్నారు. నవజోత్ సింగ్ సిద్దూ కూడా ఈ సారి ఎలాగైనా సీఎం క్యాండిడేట్‌గా బరిలోకి దిగాలన్న పట్టుదలతో కనిపించారు. సీఎం ఫేస్‌గా చన్నీని ప్రకటించడానికి కొన్ని రోజుల ముందు కూడా ఆయన ఓ మీడియాతో మాట్లాడారు. సీఎంగా ఎలాంటి వ్యక్తి సరైనవారని పేర్కొంటూ మాట్లాడారు. ఆయన వెనుక ఉన్న ఇతర కార్యకర్తలు సీఎం నవజోత్ సింగ్ సిద్దూ జిందాబాద్ అంటూ నినాదాలు ఇచ్చారు. ఆయనే సీఎంగా కావాలనే అభిప్రాయాన్ని చెప్పకనే ఆయన చెప్పించారు.

ఆ తర్వాత సీఎం ఫేస్‌గా కాంగ్రెస్ పార్టీ చన్నీని నిర్ణయించింది. ఆ తర్వాత కూడా సిద్దూ దూకుడు ఆగలేదు. కానీ, క్రమంగా ఆయన యూటర్న్ తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. అయితే, ఆయన కాంగ్రెస్‌లో కలహాలు ముగిసినట్టేనా? అంటే ఇప్పుడే చెప్పలేమని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే.. కెప్టెన్ అమరీందర్ సింగ్ అనంతరం సీఎంగా చన్నీని ఎంచుకున్నప్పుడూ తాను ఆ నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని సిద్దూ చెప్పారు. కానీ, వారి మధ్య కోల్డ్ వార్ మాత్రం కంటిన్యూ అయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయంతో ఎవరికీ ఎలాంటి అసంతృప్తి లేదని పేర్కొన్నారు. కానీ, ఈ శాంతి మరెన్ని రోజులో అని కొందరు దీర్ఘాలు తీస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?