ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చొరవతో ఆ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2024 ద్వారా పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు యోగి.
గ్రేటర్ నోయిడా : ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2024 లో పాల్గొన్న వియత్నాం ప్రతినిధుల బృందంతో ప్రత్యేకంగా భేటి అయ్యారు. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో బుధవారం ప్రారంభమైన ఐదు రోజుల గ్లోబల్ ఇండస్ట్రీ సదస్సులో పాల్గొన్న సీఎం యోగి వియత్నాం రాయబారితో సహా వివిధ ప్రతినిధులను కలిశారు. త్వరలోనే ఉత్తరప్రదేశ్‌లో వియత్నాం కంపెనీలు ఆహార శుద్ధి, ఐటీ రంగాలలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ మెగా ఈవెంట్‌లో వియత్నాం భాగస్వామ్య దేశంగా వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా వియత్నాం బృందం కార్యక్రమంలో పాల్గొనడంపై సీఎం యోగి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాన్ని ప్రారంభించే సమయంలో వేదికపైనుండే వియత్నాంను ప్రశంసించారు. అనంతరం ఆ దేశ రాయబారిని కలిసిన సందర్భంగా వారి సహకారానికి, నిబద్ధతకు కృతజ్ఞతలు తెలిపారు. వియత్నాం ప్రతినిధుల బృందంలో సాంప్రదాయ కళాకారులు కూడా ఉన్నారు, వారు బుధవారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో తమ కళను ప్రదర్శించి ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన సందర్శకుల ప్రశంసలు అందుకున్నారు.