ఉత్తర ప్రదేశ్ లో హోటల్ వ్యాపారం చేయాలనుకే ఔత్సాహికులు అద్భుత అవకాశం కల్పిస్తోంది యోగి సర్కార్. నోయిడాలో హోటల్ ఏర్పాటుకు అవసరమైన భూమిని అందుబాటులోకి తీసుకువచ్చింది.
నోయిడా : ఉత్తర ప్రదేశ్ ను ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు యోగి సర్కార్ కృత నిశ్చయంతో వుంది. ఇందులో భాగంగానే నోయిడాను అర్బన్ డైనమిక్ సిటీగా అభివృద్ధి చేసే దిశగా నిరంతర కృషి జరుగుతోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆలోచనలకు అనుగుణంగా నోయిడాలో హోటళ్ల ఏర్పాటుకు నవీన్ ఓఖ్లా వికాస్ ప్రాధికరణ (నోయిడా) ఒక కొత్త స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. నోయిడాలో హోటల్ వ్యాపారవేత్తల కోసం 'డ్రీమ్ ప్లాట్స్' పేరుతో ఈ స్కీమ్‌ను రూపొందించారు.
ఈ స్కీమ్ ద్వారా వివిధ బడ్జెట్, స్టార్ హోటళ్ల నిర్మాణానికి మార్గం సుగమం కానుంది. నోయిడాలోని సెక్టార్ 93బి, 105, 142, సెక్టార్ 135లలో ఈ-వేలం ద్వారా ఈ ప్లాట్లను కేటాయించనున్నారు. 2,000 చదరపు మీటర్ల నుండి 24,000 చదరపు మీటర్ల వరకు విస్తీర్ణంలో ఉన్న ఈ 6 ప్లాట్లకు రూ.44.08 కోట్ల నుండి రూ.410.70 కోట్ల వరకు రిజర్వ్ ధరను నిర్ణయించారు.
సెక్టార్ 93బిలో బడ్జెట్ హోటళ్ల ఏర్పాటు
నవీన్ ఓఖ్లా వికాస్ ప్రాధికరణ తీసుకొచ్చిన 'డ్రీమ్ ప్లాట్స్' స్కీమ్ ద్వారా నోయిడాలోని సెక్టార్ 93బిలో బడ్జెట్ హోటళ్ల ఏర్పాటుకు ప్లాట్లు కేటాయించనున్నారు. ఈ స్కీమ్ కింద సెక్టార్ 93బిలోని కామ్ 2, కామ్ 2ఎ కింద 2000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న రెండు ప్లాట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి ప్లాటుకు రూ.44.08 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించారు. అంతేకాకుండా కామ్ 2బి కింద 2090 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న మరో ప్లాటుకు కూడా హోటల్ వ్యాపారవేత్తలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్లాటుకు రూ.45.61 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించారు. ఈ స్కీమ్ ద్వారా మొత్తం 3 బడ్జెట్ హోటళ్లు, మూడు విభిన్న స్టార్ హోటళ్ల నిర్మాణానికి మార్గం సుగమం కానుంది.
మూడు విభిన్న స్టార్ కేటగిరీల హోటళ్ల నిర్మాణం
'డ్రీమ్ ప్లాట్స్' స్కీమ్ ద్వారా మూడు విభిన్న స్టార్ కేటగిరీల హోటళ్ల నిర్మాణానికి కూడా మార్గం సుగమం కానుంది. ఈ స్కీమ్ కింద సెక్టార్ 105లోని ప్లాట్ ఎస్‌డిసి-హెచ్-2 కోసం కూడా హోటల్ వ్యాపారవేత్తలు ఈ-వేలం ద్వారా బిడ్లు సమర్పించవచ్చు. 7500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాటుకు రూ.138.18 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించారు. అదేవిధంగా సెక్టార్ 142లోని ప్లాట్ నంబర్ 11బికి రూ.98.83 కోట్ల రిజర్వ్ ధరను నిర్ణయించారు. ఈ ప్లాటు 5200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది.
ఇక సెక్టార్ 135లో ఉన్న ప్లాట్ హెచ్2 అతిపెద్దదిగా, అత్యధిక రిజర్వ్ ధర కలిగిన ప్లాటుగా పరిగణించబడుతోంది. ఈ ప్లాటు 24000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండగా, దీని రిజర్వ్ ధర రూ.410.70 కోట్లుగా నిర్ణయించారు. ఈ మూడు ప్లాట్లను కేటాయించడం ద్వారా వివిధ స్టార్ కేటగిరీల హోటళ్ల నిర్మాణానికి అవకాశం లభిస్తుంది.
అన్ని ప్లాట్లు ప్రధాన ప్రాంతాల్లోనే
బడ్జెట్, స్టార్ హోటళ్ల ఏర్పాటు కోసం ఈ స్కీమ్ కింద కేటాయించనున్న అన్ని ప్లాట్లు కూడా ప్రధాన ప్రాంతాల్లోనే ఉన్నాయి. అక్టోబర్ 10న నిర్వహించనున్న ప్రీ-బిడ్ సమావేశంలో 'డ్రీమ్ ప్లాట్స్' కేటాయింపు స్కీమ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు రూపకల్పన చేయనున్నారు. అక్టోబర్ 17 నుంచి ఈ స్కీమ్ కింద ఆసక్తిగల దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ నవంబర్ 9.