
పాటియాల ఘర్షణ ప్రధాన సూత్రధారి బర్జిందర్ సింగ్ పర్వానా ‘‘ఖలిస్తాన్ జిందాబాద్’’ అని చెపుతూ, ఖలిస్తాన్ వ్యతిరేక మార్చ్‌ను అడ్డుకునేందుకు సిక్కు సమాజం మొత్తం వీధుల్లోకి రావాలని కోరుతున్న వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఏప్రిల్ 29న పాటియాలా జరగాల్సి ఉన్న ‘ఖలిస్తాన్ ముర్దాబాద్ మార్చ్’కు వ్యతిరేకంగా పర్వానా సిక్కులను రెచ్చగొడుతున్నారు. ఆయన తన ఫేస్‌బుక్ ఖాతాలో అనేక వీడియోలను అప్ లోడ్ చేశాడు. ఏప్రిల్ 29వ తేదీన పాటియాలాలో సాయుధ సిక్కులను గుమికూడాలని కోరాడు.
ఓ వీడియోలో ‘‘ ఖలిస్తాన్ జిందాబాద్. ర్యాలీ ఉండదని SSP మాకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. మేము సామరస్యానికి విఘాతం కలిగించము. కానీ మరెవరైనా చేస్తే ఆగము. ఏప్రిల్ 29న గురుద్వారా సమీపంలో పరిక్రమ కోసం సమావేశమవ్వండి. మార్చ్ ఆగకపోతే తదుపరి ఏమి చేయాలో మేము నిర్ణయిస్తాము. ఇది నా నిర్ణయం కాదు. ఇది మొత్తం సమాజం యొక్క నిర్ణయం’’ అని అందులో ఆయన సిక్కు సమాజానికి విజ్ఞప్తి చేశాడు.
‘‘ ఏప్రిల్ 29న ఉదయం 6 గంటలకు పరిక్రమను ప్రారంభించాలి. నాకు ఏదైనా జరిగితే పరిక్రమాన్ని ఆపవద్దు. నన్ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. నా అరెస్టు లేదా గృహనిర్బంధం జరిగే అవకాశం ఉంది ’’ అని ఆయన ఆ వీడియోలో చెప్పారు. వీడియో ముగించే ముందు ‘‘ దయచేసి ఉదయం 9 గంటలకు ఏదో ఒక విధంగా సంఘటనా స్థలానికి చేరుకోండి. నేరం చేయడం పాపం. కానీ దానిని భరించడం కూడా పాపం. నన్ను కూడా చంపవచ్చు. నాకు భద్రత లేదు. కానీ మీరు శాంతికి, సామరస్యానికి భంగం కలిగించవద్దు.’’ అని చెబుతున్నాడు.
ఈ వీడియోలో ఆయన రెచ్చగొట్టడంతో ఏప్రిల్ 29వ తేదీన రైట్ వింగ్ సంస్థలు చేసిన ఖలిస్తాన్ వ్యతిరేక ర్యాలీ హింసాత్మకంగా మారింది. రెండు వర్గాలకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. కత్తులు దూసుకున్నారు. ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది, ఈ ఘర్షణలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. అలాగే ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
ఈ ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అలెర్ట్ ఆ ప్రాంతంలో ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. ఆ స్థానంలో కొత్త వారిని నియమించారు. ఆదివారం నాడు ఇన్స్పెక్టర్ షమిందర్ సింగ్ నేతృత్వంలోని సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) బృందం మొహాలీ విమానాశ్రయంలో ఈ ఘర్షణల సూత్రదారి బర్జిందర్ సింగ్ పర్వానా పర్వానాను అరెస్టు చేసింది. తరువాత మీడియా ఎదుట ప్రవేశపెట్టింది. అనంతరం పోలీసు రిమాండ్ కోసం అతడిని కోర్డులో హాజరుపరిచారు. శాంతి భద్రతలు అదుపులోకి రావడంతో పాటియాల ఆ ప్రాంతంలో కర్ఫ్యూని ఎత్తివేసింది. మొబైల్ ఇంటర్ నెట్ సేవలను కూడా తిరిగి పునరుద్దరించింది. ఈ హింసలో ప్రమేయం ఉన్న ఎవరినీ వదిలిపెట్టబోమని సీఎం భగవంత్ మాన్ స్పష్టం చేశారు.