
Fitness Certificate: వాహనదారులకు భారీ షాక్.. వాహనాలు నడపాలంటే.. లైసెన్స్, ఆర్సీ ఉంటే సరిపోతుందని భావించే వాళ్లం.. కానీ, ఇక నుంచి ఆ రూల్స్ మారబోతున్నాయి. వాహనదారులకు దిమ్మతిరిగే కొత్త నిబంధనలను అమలు చేయబోతుంది ఢిల్లీ సర్కార్. ఇకపై నుంచి వాహనం రోడ్డెక్కాలంటే.. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పని సరిగా ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. లేదంటే.. రూ.10,000 జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా తప్పదని హెచ్చరించింది. ఈ కఠిన చట్టాలను అమలు చేయడానికి తొలుత దేశ రాజధాని ఢిల్లీ రంగం సిద్ధం చేస్తుంది.
మోటారు వాహనాల (ఎంవి) చట్టాన్ని ఉల్లంఘించి చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకుండా చాలా వాహనాలు రోడ్డుపై తిరుగుతున్నట్లు డిపార్ట్‌మెంట్ గుర్తించిన తర్వాత ఈ చర్య తీసుకుంది. ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖకు చెందిన సీనియర్ అధికారి మాట్లాడుతూ.. రోడ్లపై అటువంటి వాహనాల కోసం అన్వేషణను కొనసాగించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను కోరినట్లు, త్వరలో ఉల్లంఘించిన వారిని పట్టుకోవడానికి డ్రైవ్ ప్రారంభించబడుతుందని చెప్పారు.
రవాణా శాఖ ఇటీవల జారీ చేసిన పబ్లిక్ నోటీసు ప్రకారం .. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ విభాగాలకు చెందిన రవాణా వాహనాల యజమానులు, డ్రైవర్లు తప్పనిసరిగా గుర్తింపుపొందిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని రవాణా శాఖ ఇటీవలే పబ్లిక్ నోటీసు జారీ చేసిన్టటు అధికారులు చెప్పారు.
మోటార్ వాహనాల చట్టం- 1988లోని 56 ప్రకారం.. రవాణా వాహనం తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి. ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ జారీ చేసే ఫిటెనెస్ సర్టిఫికేట్ తప్పనిసరి. కేంద్ర మోటార్ వాహనాల చట్టం 1989 ప్రకారం, ఎనిమిదేళ్లుగా వాడకంలో ఉన్న వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ రెండేళ్ల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఎనిమిదేళ్ల కంటే పాతబడిన వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఏడాది పాటు చెల్లుబాటులో ఉంటుంది.