
UP Assembly Election 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ ఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్ లో మొదటి, రెండో దశ ఎన్నికలు పూర్తయిన క్రమంలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతుండటంతో రాజకీయాలు కాక రేపుతున్నాయి. రాష్ట్రం (Uttar Pradesh) లో మళ్లీ అధికారం దక్కించుకోవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నాలు చేస్తుండగా, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ సైతం తనదైన స్టైల్ లో ప్రచారం కొనసాగిస్తూ.. అధికార పీఠం దక్కించుకోవాలని చూస్తుంది.
ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా జాలౌన్‌లో జరిగిన బహిరంగ సభలో అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మహిళలకు అత్యంత భద్రత లేని ప్రాంతంగా ఉత్తరప్రదేశ్ ఉందని గణాంకాలు చెబుతున్నాయనీ, దీనికి భారతీయ జనతా పార్టీనే (బీజేపీ) కారణం అని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం మహిళలకు అత్యంత ప్రమాదకరమైన రాష్ట్రంగా మారిందని విమర్శించారు. "రెండు రోజుల క్రితం ఇక్కడ నుండి ఒక బాలిక అదృశ్యమైంది. ఆమె మృతదేహం ఈ రోజు కనుగొనబడింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? దీనికి బాబా ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తారా" అని అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి యోగి (Yogi Adityanath) ఆదిత్యానాథ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకువచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ 750 మంది రైతుల ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రధాని కారణం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)నే అని ఆరోపించారు. మరోసారి రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలో వస్తే అలాంటి నల్ల చట్టాలను మరోసారి తీసుకొచ్చి ప్రజల భూములను అమ్ముకుంటుందని విమర్శించారు. వివాదాస్పద ఆ నల్ల వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకున్నప్పటికీ బీజేపీని రైతులు నమ్మడం లేదరన్నారు. సమాజ్‌వాదీ పార్టీకి ప్రజలు ఓటు వేయాలని కోరారు. ప్రజా సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు.
కాగా, అత్యంత కీలకమైన.. అధికారం చేపట్టబోయే పార్టీల గెలుపును నిర్ణయించే.. యాదవులు కంచుకోట అయిన పశ్చిమ యూపీతో పాటు పలు ప్రాంతాల్లో ఆదివారం నాడు మూడో దశ ఎన్నికలు జరగున్నాయి. శుక్రవారంతో ఎన్నికల థర్డ్ ఫేజ్ ఎన్నికల పోలింగ్‌కు ప్రచారంకు చివరి రోజు. మొదటి రెండు దశలకు వరుసగా ఫిబ్రవరి 10న, ఫిబ్రవరి 14న పోలింగ్ జరిగింది. 3వ దశలో ఎన్నికలు జరగనున్న స్థానాల్లో యాదవుల ఆధిపత్యం ఎక్కువగా ఉంది. దీంతో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తమ సర్వశక్తులు ఒడ్డాయి. మూడో దశలో 59 స్థానాలకు పోలింగ్ జరగనున్న 16 జిల్లాల్లో ఐదు జిల్లాలు పశ్చిమ యూపీ, 6 అవధ్ ప్రాంతం, 5 బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఉన్నాయి. ఈ జిల్లాలు ఫిరోజాబాద్, మైన్‌పురి, ఎటా, కస్గంజ్, హత్రాస్, కాన్పూర్, కాన్పూర్ దేహత్, ఔరైయా, కన్నౌజ్, ఇటావా, ఫరూఖాబాద్, ఝాన్సీ, జలౌన్, లలిత్‌పూర్, హమీర్‌పూర్, మహోబాలు ఉన్నాయి. పోలింగ్ జరిగే 59 నియోజకవర్గాల నుండి మొత్తం 627 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 96 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.