
Uttar Pradesh Elections 2022: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార బీజేపీ దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే బీజేపీ నుంచి జోరుగా వలసల పరంపర కొనసాగుతోంది. ఈ పరిణామాలు బీజేపీకి ఏమాత్రం మింగుడుపడటం లేదు. రోజుకో మంత్రి రాజీనామా చేయడం. వారితో పాటు మరో ఇద్దరు కీలక నాయకులు పార్టీ ఫిరాయించడం పరిపాటిగా మారింది. ఇప్పటి వరకూ బీజేపీ నుంచి ముగ్గురు మంత్రులు, 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు.
యూపీలో వరుస వలసలకు యూపీ కేబినెట్ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య నాంది పలికినట్టు చర్చ సాగుతోంది. పార్టీని వీడిన నాయకులు.. ప్రధానంగా బీజేపీ అధికార నాయకత్వం వ్యతిరేక గళాలను విప్పుతున్నారు. వెనుక బడిన వర్గాలపై వివక్ష చూపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజా ప్రతినిధులను కూడా పట్టించుకోవడం లేదని.. వారిని సరైనా గౌరవం ఇవ్వడం లేదని ఆరోపణలు వెల్లువిరుస్తున్నాయి. ఈ క్రమంలో స్వామి ప్రసాద్ మౌర్య వెనుకబడిన వర్గాల గొంతని, అతడే బీసీ వర్గాల నాయకుడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్వామి ప్రసాద్ మౌర్యతో పాటు.. మరికొందరు అనుచర ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చేరనున్నారనేది సర్వత్రా చర్చనీయంగా మారింది.
ఈ నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ .. పుండు మీద కారం చల్లినట్టుగా బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఆయన శుక్రవారం లక్నోలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ బీజేపీ లో వికెట్లు టపటపా పడిపోతున్నాయని ఎద్దేవా చేశారు. అసలు బాబా ( సీఎం యోగి ఆదిత్యనాథ్) కీ క్రికెట్ ఎలా ఆడాలో తెలియడం లేదని, ఇప్పుడు క్యాచ్ వదిలేశారని అన్నారని వ్యంగ్య ఆస్త్రాలు విసురుతున్నారు. మూడ్రోజుల వ్యవధిలో ముగ్గురు మంత్రులు, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి రాజీనామా చేయడం పట్ల ఆయన పైవిధంగా స్పందించారు.
వలసల పరంపరంలో భాగంగా.. సమాజ్ వాదీ పార్టీలో ఇతర పార్టీల నేతలు కూడా చేరుతున్నారు. అప్నాదళ్ పార్టీ ఎమ్మెల్యే అమర్ సింగ్ చౌదరి, బీఎస్పీ శాసనసభ్యులు బలరామ్ సైనీ, నీరజ్ కుమార్ కుష్వాహా లు సమాజ్ వాదీ తీర్థం పుచ్చుకున్నారు. అదే మీడియా సమావేశంలో స్వామి ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ.. సమాజ్‌వాదీ పార్టీ నేతృత్వంలోని కూటమి.. యూపీలో బీజేపీకి చరమగీతం రాస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యేలు, మంత్రులతో మాట్లాడేందుకు సమయం దొరకని, గాఢ నిద్రలో ఉన్న బీజేపీ సీనియర్ నేతలు ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని మౌర్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని 403 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10, 14, 20, 23, 27 మరియు మార్చి 3 మరియు 7 తేదీల్లో ఏడు తేదీల్లో పోలింగ్ జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది. మరి ఈ సారి యూపీలో ఏ పార్టీ అధికారం చేపడుతుందో వేచి చూడాలి.