
UP Assembly Election 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ ఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికే పలు దశల ఎన్నికలు పూర్తయిన క్రమంలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతుండటంతో రాజకీయాలు కాక రేపుతున్నాయి. రాష్ట్రం (Uttar Pradesh) లో మళ్లీ అధికారం దక్కించుకోవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నాలు చేస్తుండగా, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ సైతం తనదైన స్టైల్ లో ప్రచారం కొనసాగిస్తూ.. అధికార పీఠం దక్కించుకోవాలని చూస్తుంది. అలాగే, గత వైభవాన్ని కొల్పోయిన కాంగ్రెస్, బీఎస్పీలు సైతం తమదైన తరహాలో ప్రచారం కొనసాగిస్తూ.. ఓటర్లను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే మూడు దశల పోలింగ్ పూర్తయింది. ప్రస్తుతం (బుధవారం) నాలుగో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ప్రారంభం కాగానే బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మాయావతి (Mayawati) బుధవారం లక్నోలోని మున్సిపల్ నర్సరీ స్కూల్ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, సమాజ్ వాదీ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ముస్లింలు సంతోషంగా లేరని అన్నారు. సమాజ్ వాదీ పార్టీకి ఓటు వేయడం అంటే గుండారాజ్, మాఫియా రాజ్ లకు ఓటువేయడమే అంటూ ఎద్దేవా చేశారు. "ప్రజలు వారికి ఓటేయరు. ఎస్పీ పట్ల ముస్లింలు సంతోషంగా లేరు. ఎస్పీకి ఓటేస్తే గుండరాజ్, మాఫియా రాజ్ అని యూపీ ప్రజలు ఓటు వేయకముందే ఎస్పీని తిరస్కరించారు. ఎస్పీ ప్రభుత్వంలో అల్లర్లు జరిగాయని పేర్కొంటూ.. తాము అధికారంలోకి రాలేమని ఎస్పీ నేతల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్ మంత్రి, లక్నో కంటోన్మెంట్ స్థానం నుండి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి బ్రజేష్ పాఠక్ బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగానే కాళీ బారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం వైరల్ గా మారింది. లక్నో కంటోన్మెంట్ స్థానంలో సమాజ్‌వాదీ అభ్యర్థి, రెండుసార్లు కార్పొరేటర్‌గా ఎన్నికైన సురేంద్ర సింగ్ గాంధీతో బ్రజేష్ పాఠక్ తలపడుతున్నారు. యూపీ మంత్రి అశుతోష్ టాండన్ కూడా లక్నో ఈస్ట్ స్థానం నుంచి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా ఉత్తరప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ నితిన్ అగర్వాల్‌పై పోటీలో ఉన్నారు. ఇక ఉత్తరప్రదేశ్ నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ లో భాగంగా బుధవారం నాడు పిలిభిత్, లఖింపూర్ ఖేరీ, సీతాపూర్, హర్దోయ్, ఉన్నావ్, లక్నో, రాయ్ బరేలీ, బందా, ఫతేపూర్ జిల్లాల్లోని మొత్తం 59 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)-రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్‌డీ) కూటమి, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ), కాంగ్రెస్ పార్టీలు ప్రధాన పోటీదారులుగా బహుముఖ పోటీని ఎదుర్కొంటున్నాయి. యూపీలో మొత్తం ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే మూడు దశల పోలింగ్ పూర్తి అయింది. మిగిలిన మూడు దశలకు ఫిబ్రవరి 27, మార్చి 3, 7 తేదీల్లో ఓటింగ్ జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.