
NCPCR: ఇప్పటికీ దేశంలోని అధిక సంఖ్యలో పిల్లలు దారుణ పరిస్థితుల్లో నివాసముంటున్నారని అనేక అంతర్జాతీయ నివేదికలు, స్వచ్ఛంద సంస్థలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వాలు వారి కోసం మెరుగైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాయి. ఇక దేశంలో బహిరంగ వీధుల్లో నివాసముంటున్న చిన్నారులు అధికంగానే ఉన్నారని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) పేర్కొంది. వీధుల్లో నివాసముంటున్న పిల్లల పరిస్థితులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుమో మోటో రిట్ పిటిషన్‌ను స్వీకరించి విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే జనవరి 17న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) ప్రతిస్పందనలు తెలియజేస్తూ.. అఫిడవిట్ దాఖలు చేసింది.
సుప్రీంకోర్టులో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) దాఖలు చేసిన అఫిడవిట్ వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 17,914 మంది వీధి బాలలు లేదా బహిరంగ వీధుల్లో నివాసముంటున్నవారు ఉన్నారని పేర్కొంది. ఇలా వీధుల్లో నివసించే పిల్లల సంఖ్య మహారాష్ట్రలో అత్యధికంగా ఉందని ఎన్‌సీపీసీఆర్ వెల్లడించింది. మొత్తం 17,914 మంది పిల్లలు వీధుల్లో నివసిస్తుండగా.. వారిలో 9,530 మంది పిల్లలు వారి కుటుంబాలతో వీధుల్లో నివసిస్తున్నారు. 834 మంది పిల్లలు మాత్రమే ఒంటరిగా వీధుల్లో నివసిస్తున్నారు. మరో 7,550 మంది పిల్లలు పగటిపూట వీధుల్లో నివాసముంటున్నారు. రాత్రి సమయంలో మురికివాడల్లో నివసించే కుటుంబాలకు తిరిగి వెళ్తున్నారు. వారిలో బాలురు 10,359 మంది, బాలికలు 7,554 మంది ఉన్నారని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) తెలిపింది.
ఈ తాజా డేటా ఈ ఏడాది ఫిబ్రవరి 15 వరకు రాష్ట్రాలచే నమోదుచేయబడిందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) తెలిపింది. ఈ పూర్తి వివరాలు “బాల్ స్వరాజ్” పోర్టల్‌లో అప్‌లోడ్ చేయబడ్డాయని వెల్లడించింది. NCPCR తరపున సేవ్ ది చిల్డ్రన్ ప్రొగ్రామ్ ద్వారా గుర్తించబడిన 2 లక్షల మంది పిల్లలను దీని నుంచి మినహాయించారు. ఇక వీధుల్లో నివాసముంటున్న పిల్లల వయస్సువారి వివరాలు గమనిస్తే.. అత్యధికంగా 8-13 సంవత్సరాల వయస్సు ఉన్నవారు 7,522 మంది పిల్లలు వీధుల్లో నివసిస్తుండగా, తర్వాత అత్యధికం 4-7 సంవత్సరాల మధ్య వయస్సు గల 3,954 మంది పిల్లలు వీధుల్లో నివాసముంటున్నారు. మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో వీధి బాలలు 4,952 మంది ఉన్నారు. ఆ తర్వాత గుజరాత్ (1,990), తమిళనాడు (1,703), ఢిల్లీ (1,653), మధ్యప్రదేశ్ (1,492) రాష్ట్రాల్లో అధికంగా ఉన్నారని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) డేటా పేర్కొంది. అయితే, ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 270 మంది పిల్లలు వీధుల్లో ఒంటరిగా జీవిస్తున్నారని తెలిపింది.
మతపరమైన ప్రదేశాలు, ట్రాఫిక్ సిగ్నల్స్, పారిశ్రామిక ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, పర్యాటక ప్రదేశాలలో వీధి పిల్లలు ఎక్కువగా కనిపిస్తారని కమిషన్ తెలిపింది. NCPCR 17 రాష్ట్రాల్లో 51 మతపరమైన ప్రదేశాలను గుర్తించింది, ఇక్కడ బాల యాచకులు, బాల కార్మికులు ఎక్కువగా ఉండటంతో పాటు బాలల వేధింపులు అధికంగా ఉన్నాయని తెలిపింది. కమిషన్ ఇప్పటికే మూడవ పక్షం ద్వారా ఈ స్థలాల ఆడిట్‌ను ప్రారంభించింది. 27 మతపరమైన ప్రదేశాల అధ్యయనాలు ఇప్పటికే పూర్తయ్యాయి.