
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో వున్నవారు ఏ పార్టీకి అనుకూలంగా వుండకూడదు. ఒకవేళ ఏదైనా పార్టీ మద్దతుదారే అయినా దానిని వ్యక్తిగతంగానే వుంచుకోవాలి తప్పించి బహిర్గతం చేయరాదు. పోలీస్ శాఖలో వున్నవారు ఈ విషయంలో మరింత అప్రమత్తంగా వుండాలి. అయితే కొందరు అధికారుల వల్ల మొత్తం పోలీస్ డిపార్ట్‌మెంట్‌కే మచ్చ వస్తోంది. తాజాగా ఓ పోలీస్ అధికారి ఖాకీ దుస్తులపైనే బీజేపీ కండువా కప్పుకోవడం వైరల్ అయ్యింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని పురాన్‌పూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న అశుతోష్ రఘువంశీ అనే వ్యక్తి తన యూనిఫాంపైనే బీజేపీ కండువా వేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో విపక్షాలు అశుతోష్ తీరుపై భగ్గుమంటున్నాయి. అంతేకాదు.. ఓ మాజీ పోలీస్ అధికారి దీనిపై ఫిర్యాదు సైతం చేశాడు.
అశుతోష్‌ను విధుల్లోంచి తప్పించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీస్ అధికారుల రూల్ ఆఫ్ కండక్ట్‌కు వ్యతిరేకంగా అశుతోష్ వ్యవహరించాడని ఆయన దుయ్యబట్టారు. తాను సైతం పోలీస్ శాఖలోనే కొనసాగానని.. కానీ ఏనాడు ఏ రాజకీయ పార్టీకి మద్ధతు ఇవ్వడం గానీ, బహిరంగంగా సానుభూతి ప్రదర్శించడం గానీ చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి వారి వల్ల పోలీసుల గురించి ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో అశుతోష్‌పై జిల్లా ఎస్సీ విచారణకు ఆదేశించారు.