మాస్క్ వివాదం : బ్యాంకులో కస్టమర్ పై సెక్యూరిటీ గార్డు కాల్పులు..

By AN TeluguFirst Published Jun 25, 2021, 5:08 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మాస్క్ పెట్టుకోకుండా బ్యాంకుకు వచ్చాడని ఓ కస్టమర్ మీద సెక్యూరిటీ గార్డు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కస్టమర్ చికిత్స నుంచి కోలుకుంటుండగా.. సెక్యూరిటీ గార్డు పోలీసుల అదుపులో ఉన్నాడు.

ఉత్తరప్రదేశ్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మాస్క్ పెట్టుకోకుండా బ్యాంకుకు వచ్చాడని ఓ కస్టమర్ మీద సెక్యూరిటీ గార్డు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కస్టమర్ చికిత్స నుంచి కోలుకుంటుండగా.. సెక్యూరిటీ గార్డు పోలీసుల అదుపులో ఉన్నాడు.

వివరాల్లోకి వెడితే.. ఉత్తర ప్రదేశ్, బరేలీ జిల్లాలోని ఒక బ్యాంకులో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుకు, కస్టమర్ కు మధ్య ఫేస్ మాస్క్ విషయంలో వాగ్వాదం చెలరేగింది. మాస్క్ లేకుండా బ్యాంకులోకి రావద్దని సెక్యూరిటీ గార్డు అభ్యంతరం చెప్పడంతో గొడవ మొదలయ్యింది. 

దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కస్టమర్ రాజేష్ రక్తపుమడుగులో ఉండగా, సెక్యూరిటీ గార్డు చేతిలో పిస్టల్ తో కనిపిస్తున్నాడు. రాజేష్ భార్య, నా భర్త మీద ఎందుకు కాల్పులు జరిపావని అడుగుతుంది. మరో వ్యక్తి ‘దీనికి నువ్వు జైలుకు వెడతావ్’ అంటూ సెక్యూరిటీ గార్డును అంటున్నాడు. ‘నేను కాదు అతను కూడా జైలుకు వెడతాడు’ అని సెక్యూరిటీ గార్డు అంటున్న మాటలు వినిపిస్తున్నాయి. 

రాజేష్ కుమార్ రైల్వే ఉద్యోగి. ఈ ఘటన తరువాత వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. అతనిప్పుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. గార్డు ఇప్పుడు యుపి పోలీసుల అదుపులో ఉన్నాడు.

అయితే ఈ ఘటనలో తను కావాలని షూట్ చేయలేదని, తనకు కూడా గాయాలయ్యాయని సెక్యూరిటీ గార్డు అంటున్నాడు. నా గన్ లోడ్ చేసి ఉంది. అయితే పెనుగులాటలో ట్రిగర్ నొక్కుకుపోయి, బులెట్ పేలిందని తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులకు తెలిపాడు. 

అతను మాస్క్ వేసుకోలేదు. అది నేను ప్రశ్నించాను. ఆ తరువాత అతను మాస్క్ పెట్టుకున్నాడు. కానీ నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. దీంతో నేను ప్రశ్నించేసరికి వాదనకు దిగాడు. ఇది తోపులాటకు దారి తీసింది అని.. ఘటన గురించి సెక్యూరిటీ గార్డు చెప్పుకొచ్చాడు. 

అయితే కుమార్ బంధువు ఒకరు మాట్లాడుతూ.. కుమార్ మొదటినుంచీ మాస్క్ పెట్టుకునే ఉన్నాడని.. సెక్యూరిటీ గార్డు కావాలనే కాల్పులు జరిపాడని పేర్కొన్నాడు. బ్యాంకులోకి వస్తుంటే.. మాస్క్ పెట్టుకోమన్నాడు.. పెట్టుకుని వచ్చాడు.. అయినా కూడా లంచ్ టైం.. తరువాత రావాలని చెప్పి లోపలికి రానివ్వలేదు.. దీంతో వాదన మొదలయ్యింది. అంతే రాజేష్ ను నెట్టేసి కాల్పులు జరిపాడని.. ఆ బంధువు తెలిపాడు. 

అయితే ఈ కాల్పులు కేవలం మాస్కు పెట్టుకోనందుకే జరిగాయా.. లేక వేరే ఏదైనా కారణముందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని బరేలీ పోలీస్ చీఫ్ రోహిత్ సింగ్ సజ్వాన్ అన్నారు.

"వ్యక్తి బ్యాంకులోకి ప్రవేశించిన తరువాత కొన్ని కారణాల వల్ల వాదన జరిగిందని బ్యాంక్ ఉద్యోగులు చెప్పారు. మేం గార్డును ప్రశ్నిస్తున్నాం. కారణం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం" అని సజ్వాన్ చెప్పారు.

click me!