యూపీకి చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో బర్రెను ఆర్డర్ పెట్టాడు. అడ్వాన్స్ కూడా పంపించాడు. కానీ, ఆ ఆర్డర్ టైమ్‌కు అందలేదు. దీంతో బర్రె కోసం విక్రయిస్తున్న వ్యాపారికి ఫోన్ చేశాడు. దీంతో దిమ్మతిరిగే షాక్ ఎదురైంది.
Buffalo: ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది. ఒక వేళ ఆర్డర్ సమయానికి రాకుంటే వెంటనే కస్టమర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి వాకబు చేస్తారు. ఇదొక్కటే అలాంటి సందర్భాల్లో ఒక ఆప్షన్‌గా ఉంటుంది. కానీ, యూపీకి చెందిన ఓ పాల వ్యాపారి పరిస్థితి చేతులకు అందకుండా పోయింది. ఆ పాల వ్యాపారి ఆన్‌లైన్‌లో బర్రె కోసం ఆర్డర్ పెట్టాడు.
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందిన రైతు సునీల్ కుమార్ యూట్యూబ్‌లోని ఓ వీడియోలో బర్రెను చూశాడు. ఆ బర్రెను కొనుగోలు చేయాలని అనుకున్నాడు. ఆ వీడియో కింద ప్రస్తావించిన నెంబర్‌కు ఫోన్ చేశాడు. అటు వైపు నుంచి జైపూర్‌కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ శుభమ్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఆ బర్రె మంచి బ్రీడ్‌దేనని, రోజుకు 18 లీటర్ల పాలు ఇస్తుందని చెప్పాడు.
ఆ బర్రె వీడయోను సునీల్ కుమార్‌కు పంపించాడు. ఆ బర్రె ధర రూ. 55 వేలు అని శుభం చెప్పాడు. ఆ బర్రెకు డిమాండ్ ఎక్కువగా ఉన్నదని వివరించాడు. కొనుగోలు చేయాలంటే ముందుగా అడ్వాన్స్ పేమెంట్ రూ. 10 వేలు చెల్లించాలని చెప్పాడు. దీంతో సునీల్ కుమార్ రూ. 10 వేలు వెంటనే ఆ వ్యాపారికి పంపించాడు. బర్రెను సునీల్ కుమార్ ఇంటికి డెలివరీ చేస్తామని శుభమ్ చెప్పాడు.
Also Read: AP News: టీడీపీ ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటాం: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
కానీ, ఆ బర్రె ఇంకా తన వద్దకు రాకపోవడంతో సునీల్ కుమార్ వెంటనే శుభమ్‌కు కాల్ చేశాడు. ఇంకా బర్రెను డెలివరీ చేయలేదని అంగీకరిస్తూనే మరో రూ. 25 వేలు చెల్లించాలని వివరించాడు. దీంతో సునీల్ కుమార్‌కు అనుమానాలు వచ్చాయి. అదంతా వట్టి ఫ్రాడ్ అనే అభిప్రాయానికి వస్తున్నాడు.
‘నేను ఇంకా ఆయనకు డబ్బులు పంపించలేదు. నేను మోసపోయానేమో అని నాకు అనిపించింది. ఆ తర్వాత ఇప్పుడు నా నెంబర్‌ను ఆ మోసగాడు బ్లాక్ లిస్టులో పెట్టాడు’ అని సునీల్ కుమార్ విలేకరులకు చెప్పాడు. ఇందుకు సంబంధించి సునీల్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.