గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఉత్తరప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో కి భారీ సంఖ్యలో పెట్టుబడిదారులు, ప్రజలు తరలి వస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన స్టాల్స్, ఫ్యాషన్ షోలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
గ్రేటర్ నోయిడా : గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో జరుగుతున్న ఉత్తరప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో అందరినీ ఆకట్టుకుంటోంది. మూడో రోజు నాటికి నోయిడా, గ్రేటర్ నోయిడా, ఢిల్లీ, గుర్గావ్, ఘజియాబాద్, ఫరీదాబాద్ లతో పాటు ఇతర నగరాలు, రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతున్నారు. వ్యాపారులు, పెట్టుబడిదారులు అధిక సంఖ్యలో రావడంతో ఉత్సాహంగా ఉంది. శుక్రవారం నాటికి సుమారు మూడున్నర లక్షల మంది ట్రేడ్ షోని సందర్శించినట్లు అంచనా. వారాంతం కావడంతో శని, ఆదివారాల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
undefined
పెవిలియన్ ల దగ్గర జన సందోహం
గత రెండు రోజులతో పోలిస్తే శుక్రవారం ఎక్కువ మంది ట్రేడ్ షో కి వచ్చారు. ప్రదర్శనతో పాటు సంగీత, ఫ్యాషన్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వ్యాపారవేత్తలకు ఇక్కడ ఏర్పాటు చేసిన నాలెడ్జ్ సెషన్స్ చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. దేశ, విదేశాలకు చెందిన వ్యాపార ప్రతినిధులతో సమావేశమయ్యే అవకాశం లభిస్తోంది. ప్రజలు 'వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రొడక్ట్' స్టాల్స్ ని బాగా ఆదరిస్తున్నారు. విద్య, సంస్కృతి, ఇతర రకాల స్టాల్స్ కి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.
గత ఆర్థిక సంవత్సరంలో 20.57 బిలియన్ డాలర్లకు చేరిన ఎగుమతులు: సచాన్
శుక్రవారం ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఐఈఓ) 'గ్లోబల్ మార్కెట్ ప్లేస్‌లో నావిగేట్ చేయడం: భారతీయ ఎగుమతిదారులకు అవకాశాలు, సవాళ్లు, వ్యూహాలు' అనే అంశంపై సదస్సు నిర్వహించింది. ఇందులో రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఖాదీ & గ్రామీణ పరిశ్రమలు, హ్యాండ్లూమ్ & వస్త్ర పరిశ్రమల మంత్రి రాకేష్ సచాన్ పాల్గోని ప్రసంగించారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఎగుమతులు 20.57 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ... ఈ వృద్ధిలో ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషించాయన్నారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో తమ ప్రతిభను చాటుతున్నాయని కొనియాడారు.
2025 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉత్తరప్రదేశ్: నంది
పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక మంత్రి నందగోపాల్ నంది మాట్లాడుతూ.. రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన కళాకారులు, తయారీదారులు ఉన్నారని, వారి కళ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు. 'వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రొడక్ట్' పథకం ద్వారా ప్రతి జిల్లా తన ప్రత్యేకతను చాటుకుంటూ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతోందని, స్థానిక పరిశ్రమలు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. 2025 నాటికి ఉత్తరప్రదేశ్ 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి కృషి చేస్తోందని తెలిపారు.
ఖాదీ ఫ్యాషన్ షో
ఇక్కడ నిర్వహించిన ఖాదీ ఫ్యాషన్ షోలో ఉత్తరప్రదేశ్ సంస్కృతి ప్రతిబింబించింది. రాష్ట్రానికి చెందిన రకరకాల చీరలు, ఇతర దుస్తుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
నైపుణ్యం కలిగిన యువతకు ప్రత్యక్ష ప్రదర్శన వేదిక
ఇంటర్నేషనల్ ట్రేడ్ షో మూడో రోజున రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్య శిక్షణ మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్ నైపుణ్యాభివృద్ధి మిషన్ స్టాల్ ని పరిశీలించారు. యువతను ఆత్మనిర్భర్ వైపు ప్రోత్సాహిస్తున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు కృతజ్ఞతలు తెలిపారు. నైపుణ్యాభివృద్ధి మిషన్ ద్వారా యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి, మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ట్రేడ్ షోలో భాగంగా నైపుణ్యం కలిగిన యువత తమ ప్రతిభను ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా చూపించారు.