
ఈ నెలలో దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్ లో (UP Elections 2022) గురువారం తొలి దశ పోలింగ్ ప్రారంభం కాగా, మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ ఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్ లో మొదటిదశ ఎన్నికలు పూర్తయిన క్రమంలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతుండటంతో రాజకీయాలు కాక రేపుతున్నాయి.
రాష్ట్రంలో మళ్లీ అధికారం దక్కించుకోవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నాలు చేస్తుండగా, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav ) నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ (Samajwadi Party) సైతం తనదైన స్టైల్ లో ప్రచారం కొనసాగిస్తూ.. అధికార పీఠం దక్కించుకోవాలని చూస్తోంది. వీటన్నింటి మధ్య, శుక్రవారం అఖిలేశ్ యాదవ్, జయంత్ చౌదరిలు పాల్గొన్న ర్యాలీకి సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో బీజేపీ నేతలు (bjp) , ఆ పార్టీ మద్ధతుదారులు అఖిలేష్ యాదవ్, జయంతి చౌదరిలను (Jayant Chaudhary) ట్రోల్ చేస్తున్నారు. వైరల్‌గా మారిన వీడియోలో.. ఎస్‌పి-ఆర్‌ఎల్‌డి ర్యాలీకి వస్తున్న వారికి ఓ వ్యక్తి డబ్బులు పంచుతున్నాడు. డబ్బులు తీసుకునే వ్యక్తుల తల, భుజాలపైనా సమాజ్‌వాదీ పార్టీ జెండా కూడా కనిపిస్తోంది.
మొన్నామధ్య యూపీ మంత్రి, శిఖర్‌పూర్ స్థానం అభ్యర్థి అనిల్ శర్మ కుమారుడు ప్రజలకు డబ్బు పంచుతున్నట్లు వీడియో వెలుగులోకి రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి .. సదరు మంత్రిని ఈ ఘటనపై వివరణ కోరారు. ఆ వీడియోలో శర్మ కుమారుడు కుష్ తన వాహనం దగ్గర ప్రజలకు 100 రూపాయల నోట్లను పంచుతూ కనిపించాడు.
మరోవైపు.. లఖింపూర్ ఖేరీ హింస (lakhimpur incident) నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు (ashish mishra) బెయిల్ అంశాన్ని అఖిలేష్ యాదవ్ తన ప్రచారంలో ప్రస్తావించారు. బీజేపీని రైతులు ఎప్పటికీ క్షమించరని అన్నారు. ఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజమ్ తప్పుడు కేసులపై రెండేళ్లపాటు జైలులో ఉండాల్సి వచ్చిందని ఆయన అన్నారు."అజామ్ ఖాన్ ను కూడా తప్పుడు ఆరోపణలపై జైలుకు పంపారు. గేదెదొంగతనం, కోడి దొంగతనం, పుస్తకాల దొంగతనం కేసులు అతనిపై నమోదు చేయబడ్డాయి. కారుతో ఢీ కొట్టి.. రైతులపై నుంచి కారు పొనిచ్చిన వ్యక్తి జైలు నుంచి బయటకు వచ్చాడు. ఇది బీజేపీ (కాషాయం) కొత్త భారత దేశం" అంటూ ఆరోపించారు.
‘‘మీ కోసం యూనివర్శిటీ కట్టి, మీ హక్కులు, గౌరవం కోసం పోరాడిన వ్యక్తిని జైలుకు పంపారు.. జీపుతో రైతులను చంపిని వ్యక్తిని జైలు నుంచి బయటకు పంపించారు. ప్రపంచంలో ఎక్కడా రైతులను జీపుతో ఢీ కొట్టి చంపలేదు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఇక్కడ ఉన్నందున, అతను బెయిల్ పొంది బయట ఉన్నాడు”అని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. కాగా, అజంఖాన్ రాంపూర్‌లో జౌహర్ విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఆయన వివిధ ఆరోపణలపై సీతాపూర్ జైలులో ఉన్నారు. ఎస్పీ ఖాన్‌ను రాంపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి, ఆయన కుమారుడిని జిల్లాలోని సువార్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపింది. రాంపూర్‌లో ఫిబ్రవరి 14న పోలింగ్ జరగనుంది.