
UP Elections News 2022 : ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య రెండు స్థానాల విషయంలో అంతర్గతంగా ఓ ఒప్పదం కుదిరినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్న కర్హాల్ నియోజకవర్గం, ఆయన మామ శివపాల్ యాదవ్ పోటీ చేస్తున్న జస్వంత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఇప్పటి వరకు ఏ అభ్యర్థిని నిలబెట్టలేదు. ఆయా స్థానాలకు నామినేషన్లు వేసేందుకు గడువు కూడా నిన్నటితో ముగిసిపోయింది. దీంతో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరూ బరిలో ఉండటం లేదని తేటతెల్లం అవుతోంది.
కాంగ్రెస్ జాతీయ నేతలు సోనియా గాంధీ (sonia gandhi), రాహుల్ గాంధీ (rahul gandhi) లు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన రాయ్ బరేలీ, అమేథీ నుంచి సమాజ్ వాదీ పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించలేదు. అప్పుడు ఎస్పీ తీసుకున్న చర్యకు ఇది ప్రతిచర్య అని ఆ పార్టీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
జస్వంత్ నగర్ స్థానానికి స్థానిక యూనిట్ ఆరుగురి పేర్లతో జాబితాను సమర్పించిందని, అయితే పార్టీ హైకమాండ్ ఏ పేరును ఆమోదించలేదని ఇటావాలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా యూనిట్ అధ్యక్షుడు మల్ఖాన్ సింగ్ (maldhan singh) చెప్పారు. ఎస్పీ అధినేత ములాయం సింగ్ (mulayam singh) తమ నేతలకు వ్యతిరేకంగా అభ్యర్థిని ప్రకటించనందున, కర్హల్‌లో అఖిలేష్ యాదవ్‌పై కూడా పార్టీ అలా చేయదని పార్టీ హైకమాండ్ ఆదేశించినట్లు ఉత్తరప్రదేశ్‌లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ ప్రధాన్ (prakash pradhan) ధృవీకరించారు.ఇంతకు ముందు, కర్హాల్ అసెంబ్లీ స్థానానికి జ్ఞానవతి యాదవ్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించిందని, అయితే అఖిలేష్ యాదవ్ అక్కడ నామినేషన్ దాఖలు చేసిన తర్వాత, పార్టీ ఆమె అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నదని ప్రధాన్ చెప్పారు.
మొట్ట మొదటిసారిగా అఖిలేష్ యాదవ్ (akhilesh yadav) ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ములాయం సింగ్ యాదవ్ నియోజకవర్గం మెయిన్‌పురిలో భాగమైన కర్హాల్ నుండి పోటీ చేస్తున్నారు. ఇక శివపాల్ సింగ్ యాదవ్ ఇటావాలోని జస్వంత్ నగర్ స్థానానికి ఆయన ఆరోసారి బరిలోకి దిగుతున్నారు. ఫిబ్రవరి 20 నుంచి జరిగే ఏడు దశల యూపీ ఎన్నికల్లో ఈ రెండు స్థానాలకు మూడో దశలో ఎన్నికలు జరగనున్నాయి.
కాంగ్రెస్ పార్టీ నుంచి రాయ్‌బరేలీ నియోజకవర్గంలో ప్రియాంక గాంధీ (priyanaka gandhi) పోటీ చేయాలని నిర్ణయించుకుంటే సమాజ్ వాదీ పార్టీ ఆమెకు వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెట్టదు. ఇప్పటికే అక్కడ సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసి ఉంటే.. ప్రియాంక గాంధీ నిర్ణయం తరువాత ఆ పార్టీ అభ్యర్థి వెనక్కి తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ రెబల్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే అదితి సింగ్ ఇప్పటికే ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. రాయ్ బరేలి నుంచి పోటీ చేసి తనను ఎదుర్కోవాలని ప్రియాంక గాంధీకి సవాల్ విసిరారు. ఈ స్థానానికి ఫిబ్రవరి 27వ తేదీన అంటే నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి.