
న్యూఢిల్లీ: పోలీసులు ప్రతి రోజూ విధుల్లో నిమగ్నమయ్యే ఉంటారు. అదే పండుగ రోజుల్లో వారు మరింత బిజీగా మారిపోతారు. అందుకే పండుగలను వారు సెలబ్రేట్ చేసుకోవడం అరుదుగా ఉంటుంది. వారు డ్యూటీని బాధ్యతగా నిర్వర్తించడంలో మునిగిపోయినా.. కుటుంబం నుంచి ఎదురయ్యే కొన్ని బాధ్యతలు వారిని ఇరకాటంలో పెడుతుంటాయి. ఇలాంటి సమస్యే ఎదురైన ఓ ఉత్తరప్రదేశ్ ఇన్‌స్పెక్టర్ పై అధికారికి లీవ్ లెటర్ రాశారు. ఆ లీవ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ఫర్రుఖాబాద్ జిల్లాకు చెందిన ఓ ఇన్‌స్పెక్టర్ తన వివాహ సంబంధంలోని సమస్యను పేర్కొంటూ ఎస్పీకి లేఖ రాశారు. గత 22 ఏళ్లుగా హోలీ వేడుకలను అత్తవారింటిలో జరుపుకోలేదని తన భార్య కోపంగా ఉన్నదని తెలిపారు. ఈ సారి కూడా ఆమెను తీసుకుని అత్తవారింటికి వెళ్లడం సందిగ్ధంగానే ఉన్నదని వివరించారు. తనకు సెలవులు లేని కారణంగా వెళ్లడం కుదరడం లేదని పేర్కొన్నారు.
Also Read: హోలీ నాడు పిడిగుద్దులతో పండుగ.. కారే రక్తాన్ని బూడిదతో తూడ్చుకుంటూ.. తెలంగాణలో ఎక్కడో తెలుసా?
ఎస్పీకి ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్ రాసిన లేఖలో ఇలా ఉన్నది. ‘22 ఏళ్ల నా వైవాహిక జీవితంలో ఇప్పటి వరకు హోలీ పండుగ రోజున నా భార్యను ఆమె అమ్మగారింటికి తీసుకెళ్లలేకపోయాను. కాబట్టి, ఆమె తన అమ్మవారింటి వద్ద హోలీ పండుగ జరుపుకోలేకపోయింది. అందుకే ఆమె నా పై కోపంగా ఉంది. ఈ సారి కచ్చితంగా వెళ్లాలని ఆమె ఒత్తిడి చేస్తున్నది. కానీ, సెలవులు లేకుండా నేను అక్కడికి వెళ్లడం సాధ్యం కాదు. కాబట్టి, నా సమస్యను, నా పరిస్థితిని అర్థం చేసుకుని పది రోజుల క్యాజులవ్ లీవులు ఇవ్వాలని కోరుతున్నాను’ అని ఆ వైరల్ లెటర్‌లో ఉన్నది.
ఈ సెలవు దరఖాస్తు చదివిన ఎస్పీ.. ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్‌కు పది రోజుల సెలవులు ఇవ్వలేదు. కానీ, ఐదు రోజుల క్యాజువల్ లీవులు మంజూరు చేశారు. మార్చ్ 4వ తేదీ నుంచి ఈ సెలవులు మంజూరు చేశారు.