ఇక బుల్డోజర్లు కాదు యుద్ద ట్యాంకర్లే : జమ్మూ కాశ్మీర్ లో యోగి మార్క్ ఎలక్షన్ క్యాంపెయిన్

By Arun Kumar PFirst Published Sep 27, 2024, 2:00 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జమ్మూ-కశ్మీర్‌లో బిజెపి తరపున ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ క్రమంలో పాకిస్తాన్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, బిజెపి తిరిగి అధికారంలోకి వస్తే పీఓకే భారత్‌లో భాగం అవుతుందని అన్నారు.

జమ్మూ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం నుంచి జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోకి దిగారు. రామ్‌గఢ్ నుంచి పోటీ చేస్తున్న దేవేంద్ర కుమార్ మణియాల్, విజయ్‌పూర్ నుంచి చంద్రప్రకాష్ గంగా, సాంబా నుంచి సుర్జిత్ సింగ్, ఆర్ఎస్ పురా నుంచి డాక్టర్ నరేందర్ సింగ్ రైనా, సుచేతగఢ్ నుంచి ప్రొఫెసర్ గరురాం భగత్, బిష్నా నుంచి  రాజీవ్ భగత్‌లు పోటీ చేస్తున్నారు.... వారిని గెలిపించాలని యోగి కోరారు.

ఆర్ఎస్ పురాలో జరిగిన ర్యాలీలో సీఎం యోగితో పాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రైనా కూడా పాల్గొన్నారు. చాంబ్ నుంచి బిజెపి అభ్యర్థి రాజీవ్ శర్మను గెలిపించాలని యోగి ఆదిత్యనాథ్ మొబైల్ ద్వారా ఓటర్లకు సందేశం పంపారు. జమ్మూ కశ్మీర్‌లో అభివృద్ధి, భద్రత కోసం బిజెపి అవసరమని యోగి అన్నారు. బిజెపి తిరిగి అధికారంలోకి వస్తే పీఓకే భారత్‌లో భాగం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

Latest Videos

మానవత్వానికి క్యాన్సర్ పాకిస్తాన్

రామ్‌గఢ్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో సీఎం యోగి మాట్లాడుతూ.. ఇక్కడ బిజెపి తిరిగి అధికారంలోకి వస్తే పీఓకే భారత్‌లో భాగం అవుతుందని అన్నారు. పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి శ్రమించాల్సి వస్తోందని, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రత్యేక దేశంగా అవతరించాలని డిమాండ్ చేస్తోందని ఆయన అన్నారు. జమ్మూ-కశ్మీర్‌తో పాటు ముజఫరాబాద్‌లో కూడా ఎన్నికలు జరిగితే బాగుండని ప్రజలు అంటున్నారని ఆయన అన్నారు. బలూచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్‌తో తమకు సంబంధం లేదని, అది మానవత్వానికి క్యాన్సర్ అని, ప్రపంచం దాని నుంచి విముక్తి పొందాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

భారత్ 80 కోట్ల మందికి రేషన్ ... పాక్ లో రొట్టెల కోసం క్యూలు

ఒకవైపు భారత్‌లో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్, 60 కోట్ల మందికి ఏటా రూ.5 లక్షల ఆరోగ్య బీమా, జీవన్ జ్యోతి, జీవన్ బీమా భద్రతా పథకం ప్రయోజనం, 12 కోట్ల మందికి కిసాన్ సమ్మాన్ నిధి, 10 కోట్ల మంది పేదల ఇళ్లలో మరుగుదొడ్లు, 10 కోట్ల మంది పేదలకు ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయని సీఎం యోగి అన్నారు. జమ్మూ-కశ్మీర్‌లో దాదాపు 3 లక్షల మంది పేదలకు పీఎం ఆవాస్ యోజన ప్రయోజనం చేకూరిందని అన్నారు. మరోవైపు పాకిస్తాన్‌లో ప్రజలు రొట్టెల కోసం క్యూలు కడుతున్నారని ఆయన అన్నారు.

కనుమరుగైన రాళ్ల దాడులు

ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కలను ప్రధాని మోదీ సాకారం చేశారని సీఎం యోగి అన్నారు. తద్వారా ఉగ్రవాదానికి పునాది లేకుండా పోయిందని ఆయన అన్నారు. కాంగ్రెస్, పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్‌లు జమ్మూ-కశ్మీర్‌ను ఉగ్రవాద స్థావరంగా మార్చాయని, కానీ నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక, అమిత్ షా హోంమంత్రి అయ్యాక ఉగ్రవాదం చివరి దశకు చేరుకుందని, రాళ్ల దాడులు కనుమరుగయ్యాయని ఆయన అన్నారు.

జమ్మూ-కశ్మీర్‌ను మత విద్వేషాల్లోకి నెట్టిన పాపం కాంగ్రెస్, పీడీపీలదే

మహారాజా హరి సింగ్, ప్రేమ్‌నాథ్ డోగ్రా, బ్రిగేడియర్ రాజేందర్ సింగ్‌లను ఉద్దేశించి సీఎం యోగి మాట్లాడుతూ.. ఈ వీరులు జమ్మూ-కశ్మీర్‌ను భూమిపై స్వర్గంగా మార్చారని అన్నారు. కానీ కాంగ్రెస్, పీడీపీ లు దీన్ని మత విద్వేషాల్లోకి నెట్టివేసే పాపానికి ఒడిగట్టాయని అన్నారు. ఈ ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రధాని మోదీ కర్తార్‌పూర్ కారిడార్‌ను నిర్మించారని గుర్తుచేసారు. కాంగ్రెస్ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినోత్సవాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటుంది... కానీ ప్రధాని మోదీ గురు గోవింద్ సింగ్ నలుగురు సాహిబ్జాదేల త్యాగాలను స్మరించుకునేలా డిసెంబర్ 26న వీర్ బాల్ దివాస్‌గా జరుపుకోవాలని నిర్ణయించారని ఆయన అన్నారు. యూపీలో కూడా ఈ రోజున కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు.

ఇది ఉగ్రవాద రాష్ట్రం కాదు, పర్యాటక రాష్ట్రంగా మారింది

మీరు కొత్త భారతంలోని కొత్త జమ్మూ-కశ్మీర్‌ను చూశారని సీఎం యోగి అన్నారు. ఇది ఉగ్రవాద రాష్ట్రం కాదని, పర్యాటకానికి అనువైన ప్రదేశంగా మారిందని ఆయన అన్నారు. కాంగ్రెస్, పీడీపీ పాలనలో ఇక్కడ జెండా ఎగురవేయాలంటే కూడా ప్రాధేయపడాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు ఇక్కడ జీ20 సదస్సు జరుగుతోందని ఆయన అన్నారు. గతంలో అమర్‌నాథ్ యాత్రను అనుమతించబోమని బెదిరింపులు వచ్చేవని, వాటిని విని ఈ పార్టీల నాయకులు భయపడిపోయేవారని, కానీ ఇప్పుడు దేశం నలుమూలల నుంచి, ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు బాబా బర్ఫానీ, మాతా వైష్ణోదేవి దర్శనానికి వస్తున్నారని ఆయన అన్నారు.

కాంగ్రెస్, పీడీపీలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు

కాంగ్రెస్,పిడీపీలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలని సీఎం యోగి అన్నారు. రాజకీయాల్లో ఇలాంటి కంపెనీలు మూతపడాలని ఆయన అన్నారు. దళితులు, గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ఇక్కడి నుంచి వెళ్లిన కులాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ఎలాంటి కృషి చేయలేదని ఆయన అన్నారు. 1947లో ఆస్తులు కోల్పోయిన వారికి, పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వారికి పౌరసత్వం కల్పించలేదని ఆయన అన్నారు. మోదీ, షాలు పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేసినప్పుడు ఈ పార్టీలన్నీ వ్యతిరేకించాయని ఆయన గుర్తుచేశారు. 1990లలో కాంగ్రెస్, పీడీపీల పాపం కూడా తక్కువేమీ కాదని, ఆ సమయంలో కాశ్మీరీ పండిట్లపై అత్యాచారాలు జరిగాయని ఆయన అన్నారు. బాధితులకు మద్దతుగా నిలవకుండా ఈ పార్టీలు ఉగ్రవాదులకు మద్దతుగా నిలిచాయని, బిజెపి మాత్రమే బాధిత కాశ్మీరీ పండిట్లకు అండగా నిలిచిందని ఆయన అన్నారు.

దేశ ఆకాంక్షలకు ప్రతీకగా బిజెపి, ప్రధాని మోదీ

పండిట్ నెహ్రూ ఆర్టికల్ 370 ద్వారా ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని సీఎం యోగి అన్నారు. కాశ్మీరీ పండిట్ల వలసలకు కాంగ్రెస్, నెహ్రూలే కారణమని ఆయన అన్నారు. చినాబ్ వంతెన, జోజిలా, శ్యామా ప్రసాద్ ముఖర్జీ సొరంగం, ఢిల్లీ-కట్రా మధ్య వందే భారత్ రైలు కొత్త గుర్తింపును తెచ్చిపెడుతున్నాయని ఆయన అన్నారు. బిజెపి, మోదీ దేశం, జమ్మూ-కశ్మీర్ ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచారని ఆయన అన్నారు.

యూపీలో మాఫియా నరకానికే

కాంగ్రెస్ దేశంలో చాలా కాలం పాలించిందని, కానీ అయోధ్య సమస్యను పరిష్కరించలేకపోయిందని సీఎం యోగి అన్నారు. భారతీయులు ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్రంలో, యూపీలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, దీంతో అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరుగుతోందని ఆయన అన్నారు. అక్కడ ఆలయం నిర్మితమైందని, కానీ ఒక్క దోమ కూడా చావలేదని ఆయన అన్నారు.   

జమ్మూ-కశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పుడు రాళ్ల దాడులు జరిగాయని ఆయన అన్నారు. ట్యాబ్లెట్లు పట్టుకునే చేతుల్లోకి ఈ పార్టీలు తుపాకులు ఇచ్చాయని ఆయన విమర్శించారు.  పీడీపీ, కాంగ్రెస్ నాయకులు ఇక్కడి డబ్బును దోచుకుని ఏడాదిలో ఎనిమిది నెలలు యూరప్, ఇంగ్లండ్‌లలో తిరిగేవారని ఆయన ఆరోపించారు. బిజెపి అందరితోనూ కలిసి నడుస్తుందని, అందరి అభివృద్ధి కోసం కృషి చేస్తుందని, కానీ ఎవరినీ తృప్తిపరిచే ప్రయత్నం చేయదని ఆయన స్పష్టం చేశారు. బిజెపి అంటే భద్రత, సుపరిపాలన, అభివృద్ధికి హామీ అని ఆయన అన్నారు. బిజెపి ప్రభుత్వం ఉన్నచోట అభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతోందని ఆయన అన్నారు. కొత్త భారతంలో యూపీ కూడా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు.

రాహుల్ గాంధీకి సీఎం యోగి ప్రశ్నలు

జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక జెండా కావాలని నేషనల్ కాన్ఫరెన్స్ అంటోందని, దానికి రాహుల్ గాంధీ మద్దతు తెలుపుతున్నారా? అని సీఎం యోగి ప్రశ్నించారు. 370, 35ఎలను తిరిగి తీసుకొచ్చి జమ్మూ-కశ్మీర్‌ను అశాంతి, అల్లకల్లోలంలోకి నెట్టాలని కోరుకుంటున్నారు, దానికి రాహుల్ మద్దతు తెలుపుతున్నారా? అని ఆయన నిలదీశారు. కాశ్మీరీ యువతను బలిపెట్టి పాకిస్తాన్‌తో చర్చలు జరిపి వేర్పాటువాదాన్ని ప్రోత్సహించాలని కాంగ్రెస్ భావిస్తోందా? అని ఆయన ప్రశ్నించారు. ఎల్ఓసీ ద్వారా వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించాలనే నిర్ణయంతో సరిహద్దు దాటి ఉగ్రవాదానికి ఆజ్యం పోయడం జరుగుతుందని, దానికి కాంగ్రెస్ మద్దతు తెలుపుతోందా? అని ఆయన నిలదీశారు.

రాళ్ల దాడులు, వేర్పాటువాదంలో పాల్గొన్న వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి ఉగ్రవాదం, హింస, బంద్‌ల యుగాన్ని తిరిగి తీసుకురావాలని కాంగ్రెస్ భావిస్తోందా?  అని యోగి ప్రశ్నించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్ పార్టీల నిర్ణయానికి కాంగ్రెస్ మద్దతు తెలుపుతోందని ఆయన విమర్శించారు. దళితులు, గుజ్జర్లు, బకర్వాల్స్, గిరిజనులకు ప్రధాని మోదీ రిజర్వేషన్లు కల్పించారని, వాటిని రద్దు చేయాలనే పార్టీల ప్రకటనకు కాంగ్రెస్ మద్దతు తెలుపుతుందా? అని ఆయన ప్రశ్నించారు.

శంకరాచార్య పర్వతాన్ని తఖ్త్-ఎ-సులేమాన్ అని, హరి పర్వతాన్ని కోహ్-ఎ-మరణ్ అని పిలవాలని కాంగ్రెస్ కోరుకుంటోందా అని ఆయన నిలదీశారు. జమ్మూ-కశ్మీర్ ఆర్థిక వ్యవస్థను మళ్లీ అవినీతిలో కూరుకుపోయేలా చేసి పాకిస్తాన్ మద్దతుగల కొందరి చేతుల్లో పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోందా? అని ఆయన ప్రశ్నించారు. జమ్మూ, కాశ్మీర్ మధ్య చిచ్చు పెట్టేందుకు   చేస్తున్న ప్రయత్నాలకు కాంగ్రెస్ మద్దతు తెలుపుతోందని ఆయన విమర్శించారు. కాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించాలనే విభజన రాజకీయాలకు కాంగ్రెస్, రాహుల్ గాంధీ మద్దతు తెలుపుతున్నారా? అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రశ్నించారు.

click me!