
పాకిస్థాన్- భారత్‌ల మద్య సమస్యలకు సంబంధించి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎన్ఎస్ న్యూస్ 18 టౌన్ హాల్‌లో మాట్లాడిన జయశంకర్.. పాకిస్థాన్‌తో భారత్ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు అమెరికా పాక్‌కు ఇచ్చిన మద్దతే ప్రత్యక్షంగా కారణమని అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని అతివాదులను పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రమూకలు ప్రోత్సహించడం, ఆయుధాలు ఇవ్వడం ద్వారా కశ్మీర్ లోయలో శాంతికి విఘాతం కలిగిస్తున్న నేపథ్యంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇక, యూఎస్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ గురువారం పాకిస్థాన్ అమెరికా భాగస్వామిగా పేర్కొన్నారు. ఇరు దేశాల పరస్పర ప్రయోజనాలకు ఉపయోగపడే రీతిలో ఇస్లామాబాద్‌తో సంబంధాలను ముందుకు తీసుకెళ్లే మార్గాలను వాషింగ్టన్ పరిశీలిస్తుందని చెప్పారు. ‘‘పాకిస్తాన్ మా భాగస్వామి. ఆ భాగస్వామ్యాన్ని ఒక పద్ధతిలో ముందుకు తీసుకెళ్లడానికి మేము మార్గాలను చూస్తాము’’ అని Ned Price పేర్కొన్నారు. అంతకుముందు మేలో పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ.. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆహ్వానం మేరకు అమెరికా పర్యటనకు వెళ్లారు.
ఈ క్రమంలోనే పాకిస్తాన్‌తో భారత్‌కు ఉన్న సంబంధాలపై జైశంకర్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య సంబంధాలను సులభతరం చేయడానికి సరిహద్దుకు ఇరువైపులా ఉన్న కొద్దిమంది ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ కంటే ఎక్కువ కృషి చేశారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఆయన పదవీకాలం ప్రారంభం నుంచే స్నేహ హస్తం చాచడానికి అన్ని ప్రయత్నాలు చేశారని చెప్పారు. ‘‘కానీ ఏమి తప్పు జరిగింది?’’ అని విదేశాంగ మంత్రి ప్రశ్నించారు. ఓ ప్రశ్నకు సమాధానమిచ్చిన జైశంకర్.. ఉరీ, పఠాన్‌కోట్, పుల్వామా ఉగ్రదాడులను అడ్డుకోలేక పాకిస్థాన్ తప్పు చేసిందని అన్నారు.
పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో.. ‘‘భారతదేశంపై జాతీయ ఏకాభిప్రాయం ఉన్న పాకిస్తాన్ విధానంలో ఎటువంటి మార్పు లేదు. పాకిస్తాన్ ఎల్లప్పుడూ భారతదేశంతో సహా అన్ని పొరుగు దేశాలతో సహకార సంబంధాలను కోరుకుంటుంది. ముఖ్యమైన జమ్మూ కాశ్మీర్ వివాదంతో సహా అన్ని అత్యుత్తమ సమస్యలను పరిష్కరించడానికి మేము నిర్మాణాత్మక, ఫలిత-ఆధారిత సంభాషణలను స్థిరంగా సమర్ధించాము’’ అని పేర్కొంది.
ఈ ప్రకటనపై జైశంకర్ మాట్లాడుతూ.. భారత్-పాకిస్థాన్ సంబంధాలను మెరుగుపరుచుకోవాలనే ఎవరి కోరికను ఖండించడం, తగ్గించడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. అయితే ‘‘ఆ మంచి మాటలు క్షేత్ర స్థాయిలో తీసుకుంటున్న చర్యలతో సరిపోలాలి’’ అని చురకలు అంటించారు. అదే సమయంలో నిరాశావాదం వినిపించడానికి నిరాకరించిన జైశంకర్.. పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటికీ కొత్తదేనని.. ఎలా పరిపాలిస్తుందనేది వేచి చూడాలని అన్నారు.
ఆఫ్ఘనిస్థాన్‌పై జైశంకర్ మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్‌కు చారిత్రక సంబంధం ఉందన్నారు. ఆఫ్ఘనిస్తాన్ పౌర సమాజ నిర్మాణానికి భారతదేశం సహకరించిందని గుర్తించారు. అది అనేక రూపాల్లో జరిగిందన్నారు. ‘‘అయితే గత ఏడాది తాలిబాన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత.. ఇప్పటికే వివిధ కొరతలతో బాధపడటం ప్రారంభించింది. మందులు, వ్యాక్సిన్లు, ఆహార ధాన్యాలు మొదలైన వాటితో సహాయం చేయడానికి భారతదేశం ప్రయత్నిస్తూనే ఉంది’’ అని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్‌కు, ఆ దేశ దాని ప్రజలకు అత్యంత ఖచ్చితమైన మార్గంలో ఎలా సహాయం చేయాలనేదే ప్రస్తుతం భారతదేశం ముందున్న ప్రశ్న అని తెలిపారు.