కన్నెర్ర చేస్తున్న అన్నదాత: రేపు కేంద్ర కేబినెట్ భేటీ

By Siva KodatiFirst Published Dec 8, 2020, 8:17 PM IST
Highlights

రైతుల ఆందోళనలు రోజురోజుకి ఉద్ధృతమవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 10.30 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. కొత్త వ్యవసాయ చట్టాలపై మంత్రి మండలి చర్చించనుంది

రైతుల ఆందోళనలు రోజురోజుకి ఉద్ధృతమవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 10.30 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. కొత్త వ్యవసాయ చట్టాలపై మంత్రి మండలి చర్చించనుంది.

కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత కొన్నిరోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరిని శాంతిపజేసేందుకు ఇప్పటికే కేంద్రం పలు దఫాలుగా రైతు ప్రతినిధులతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో రైతుల్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మరోసారి చర్చలకు ఆహ్వానించారు. మంగళవారం సాయంత్రం 7గంటలకు రైతులు చర్చలకు రావాలని అమిత్‌షా తమను ఆహ్వానించారని.. రైతు సంఘాల నేత రాకేశ్‌ టికైట్‌ తెలిపారు.

మరోవైపు రైతు సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బంద్‌ కొనసాగుతున్న క్రమంలో షా ఇప్పుడు అత్యవసరంగా చర్చలకు ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

చర్చలు జరిపి ఇక రైతుల నిరసనలకు స్వస్తి పలకాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఐదో విడత చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో డిసెంబర్‌ 8న రైతు సంఘాలు దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి.

ఈ బంద్‌కు రాజకీయ పార్టీలు, ట్రేడ్‌ యూనియన్లు, ఇతర ఉద్యోగ సంఘాలు భారీగా మద్దతు పలికాయి. మంగళవారం ఉదయం నుంచే దేశవ్యాప్తంగా బంద్ ప్రభావం కనిపించింది. 

click me!